కొద్దిగా ఉప్పు, నిమ్మరసాలను కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు తలెత్తవు.
నల్లద్రాక్ష గుజ్జులో కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే చర్మం నల్లబడదు.
నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని నిత్యం వాడడం వల్ల వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడదు. నిమ్మలో యాంటిసెప్టిక్ సుగుణాలు కూడా ఉండడం వల్ల చర్మం ఇన్ ఫెక్షన్ల బారిన పడదు.
చేతివేళ్ల మీద వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అంటారు. వీటిపై కలబంద గుజ్జు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. కలబందలో ఉండే మేలిక్ ఆమ్లం పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
శరీరంపై వచ్చే దద్దుర్లపై కర్పూరం నూనె రాసుకుంటే పోతాయి.
ఎన్నో పోషకాలు, పీచుపదార్థాలు ఉన్న జామ పండు చర్మం ఎలాస్టిసిటీని కాపాడుతుంది. వయసుపైబడకముందే చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది కూడా.
నీళ్లు ఎక్కువ తాగితే చర్మం మ్రుదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నీరు బాగ ఉండే యాపిల్స్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, కమలాపండ్లు, ద్రాక్ష, కీర, టొమాటో వంటివి ఎక్కువగా తింటే చర్మం పట్టులా నునుపుగా, కాంతివంతంగా ఉంటుంది.
బార్లీ నీళ్లు తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. అందులోనూ వేసవిలో బార్లీ నీళ్లు తాగడం శరీరానికి కూడా ఎంతో మంచిది.
ముఖంపై ట్యాన్ అంటే నలుపుదనం ఉంటే టొమాటో ప్యాక్ వేసుకుంటే పోతుంది. తాజా టొమాటో తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై చక్కెర చల్లాలి. ఆ తర్వాత ఆ టొమాటో ముక్కలపై గడ్డ పెరుగు కొద్దిగా వేసి వాటితో ముఖంపై బాగా రుద్దుకోవాలి. టొమాటో ముక్కలతో ఇలా ముఖాన్ని రుద్దుకుంటే చర్మంపై ఉన్న మ్రుతకణాలు పోతాయి. అలాగే ముఖంపై పేరుకున్న నల్లదనం కూడా మెల్లగా పోతుంది.
బెల్లంతో చేసిన పల్లీ ఉండలు తినడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. చర్మంపై ఏర్పడిన మచ్చలు కూడా పోతాయి.
రోజూ ఉదయం, సాయంత్రం ఆముదం నూనెను ముఖానికి పట్టిస్తే చర్మంపై ఏర్పడ్డ నల్లదనం పోతుంది. అంతేకాదు కళ్ల కింద ఏర్పడిన నల్లని వలయాలు కూడా దీనివల్ల పోతాయి.