Snoring in children: పిల్లల్లో చిన్న సమస్యలు వచ్చినా తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. సాధారణంగా అనారోగ్యానికి తలనొప్పి, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో శరీరంలో జరిగే సమస్యలు నేరుగా బయటికి రాకుండా చిన్న చిన్న మార్పుల రూపంలో మాత్రమే బయటపడతాయి. అలాంటి లక్షణాల్లో ఒకటి గురక. పెద్దవాళ్లలో తరచూ వినిపించే గురక పిల్లల్లో సాధారణంగా కనిపించదు. అయితే చిన్నారులు నిరంతరం లేదా ఎక్కువగా గురకపెడుతున్నారని గమనిస్తే దానిని తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎడినాయిడ్స్..
వైద్యుల వివరణ ప్రకారం, పిల్లల్లో ఎక్కువగా కనిపించే గురక సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి ఎడినాయిడ్స్. ఇది ముక్కు వెనుక భాగంలో, గొంతు పైభాగంలో ఉండే చిన్న కణజాలం. ఇది శరీర రక్షణ వ్యవస్థలో భాగంగా సూక్ష్మజీవులు, వైరస్‌లను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. చిన్న వయసులో పిల్లల్లో ఇవి సహజంగానే కొంత పెద్దగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ ఇవి క్రమంగా చిన్నవైపు మారుతాయి. కానీ, తరచూ జలుబు, అలర్జీ, ఇన్‌ఫెక్షన్లు వస్తే ఈ కణజాలం ఉబ్బిపోతుంది. ఆ ఉబ్బరం కారణంగా శ్వాసకోశ మార్గం తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆపటం జరుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు రాత్రి నిద్రలో సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతారు. ఆపైనే గురక మొదలవుతుంది. కేవలం గురక మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో నిద్రలో ఊపిరి ఆగిపోవడం, మళ్ళీ గట్టిగా ఊపిరి పీల్చుకోవడం కూడా జరుగుతుంది. దీనినే స్లీప్ ఆప్నియా అంటారు. ఇలా నిద్రలో శ్వాస సమస్యలు వస్తే పిల్లలు ప్రశాంతంగా నిద్రపట్టలేరు. రాత్రంతా ఇబ్బంది పడిన ఫలితంగా పగటిపూట చిరాకు, చదువుపై దృష్టి తగ్గడం, శక్తి లోపించడం జరుగుతుంది.
ముక్కుదిబ్బడ, తరచూ ముక్కు కారడం..
పిల్లలలో గురక సమస్య ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటే ఇతర లక్షణాలను కూడా గమనించాలి. ముక్కుదిబ్బడ, తరచూ ముక్కు కారడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం, గొంతులో గరగరలాడటం, మింగడంలో ఇబ్బందులు రావడం వంటి సమస్యలు కనిపిస్తే అవి కూడా ఎడినాయిడ్స్‌తో సంబంధం ఉండే అవకాశముంది. కొన్నిసార్లు చెవిలో ఇన్‌ఫెక్షన్లు పునరావృతమవుతాయి. దీనికి కారణం ఎడినాయిడ్స్ వలన యూస్టాకియన్ ట్యూబ్ బ్లాక్ కావడం.
యాంటీహిస్టమిన్స్ లేదా యాంటీబయాటిక్స్..
ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ENT స్పెషలిస్ట్ లేదా బాల వైద్యుడు మొదటగా శారీరక పరీక్ష చేస్తారు. అవసరమైతే నాసల్ ఎండోస్కోపీ, స్కాన్ వంటి పరీక్షల ద్వారా స్పష్టత తీసుకొస్తారు. సమస్య మొదటిదశలో ఉంటే యాంటీహిస్టమిన్స్ లేదా యాంటీబయాటిక్స్ వంటివి వాడమని సూచిస్తారు. కానీ ఎడినాయిడ్స్ చాలా పెరిగి శ్వాసనాళం బ్లాక్ అయ్యే స్థితి వస్తే శస్త్రచికిత్స అవసరం అవుతుంది. దీనినే అడినాయిడెక్టమీ అంటారు. ఇది సాధారణంగా పిల్లలకు సురక్షితంగా చేసే శస్త్రచికిత్సగా పరిగణిస్తారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/sleeping-with-feet-towards-door-is-considered-inauspicious/
పిల్లల గురకను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలికంగా తీవ్రమైన ఫలితాలు వస్తాయి. క్రమంగా శరీర ఎదుగుదల మందగించడం, మానసిక పనితీరులో తగ్గుదల, చదువులో వెనకబాటు, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా స్లీప్ ఆప్నియా సమస్య వల్ల మెదడుకు సరిపడ ఆక్సిజన్ అందకపోవడం దీర్ఘకాలంలో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లల్లో గురక వస్తే అది ఎప్పుడూ సాధారణ సమస్య అనుకోవద్దు. రెండు మూడు రోజులు కొనసాగితే వెంటనే డాక్టర్‌ను కలవాలి. ముందస్తు చికిత్స ద్వారా సమస్యను అదుపులోకి తెచ్చుకోవచ్చు. చిన్నపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవడం వాళ్ళ ఆరోగ్యానికి, ఎదుగుదలకు చాలా అవసరం.


