వేసవి దద్దుర్లు ఇలా పోతాయి
వేసవిలో తీవ్ర ఎండల వల్ల ఒంటిపై ఎర్రటి దద్దుర్లతో చాలామంది బాధపడుతుంటారు. వీటికి కొన్ని సహజసిద్ధమైన టిప్స్ ఉన్నాయి. అవి..
కూల్ బాత్స్, షవర్స్ చేస్తే చర్మం చల్లబడి దద్దుర్ల తీవ్రత, ఇరిటేషన్ తగ్గుతుంది.
స్నానం చేసిన తర్వాత చర్మాన్ని బాగా పొడిగా తుడుచుకోవాలి. వంటిపై తడి ఉంటే అది చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది.
వేసవికాలంలో చర్మాన్ని ఇరిటేట్ చేసే దుస్తులకు దూరంగా ఉండడం మంచిది. చెమటను పీల్చుకునే కాటన్ వస్త్రాలు ధరించడం ఎంతో మంచిది. అలాగే వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల కూడా
చర్మానికి గాలి తగిలి తగినంత సాంత్వన లభిస్తుంది. బిగుతు దుస్తులు, పాలిస్టర్, సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండాలి.
ఇరిటేటింగ్ స్కిన్ పై కోల్డ్ కంప్రసెస్ బాగా పనిచేస్తాయి. అలాగే చల్లటి నీళ్లలో తడిపిన గుడ్డతో దద్దుర్లను అద్దితే వాటి మంట తగ్గుతుంది. లేదా గుడ్డలో ఐస్ ముక్కలు పెట్టి చుట్టి దానితో దద్దుర్లపై సున్నితంగా ప్రెస్ చేస్తే ఎంతో సాంత్వన లభిస్తుంది.
చర్మ మంటను, ఇరిటేషన్ ను తగ్గించడంలో ఓట్ మీల్ బాగా పనిచేస్తుంది. దద్దుర్లతో పాటు పలు చర్మ సమస్యల నుంచి ఇది ఉపశమనం ఇస్తుంది. గోరువెచ్చటి నీళ్లల్లో ఒకటి లేదా రెండు కప్పుల ఓట్ మీల్ వేసి 20 నిమిషాల పాటు నాననిచ్చి ఆ నీటితో స్నానం చేస్తే చర్మం చల్లబడుతుంది. చర్మం ఇరిటేట్ అవదు. లేదా ఒకపాలు ఓట్ మీల్ తీసుకుని అందులో అంతే పరిమాణంలో అంటే ఒకపాలు నీళ్లు కలిపి
పేస్టులా చేసి దాన్ని చర్మానికి అప్లై చేయాలి.
పలు అధ్యయనాల్లో శాండల్ వుడ్ పొడిలో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయని రుజువైంది. ఇది నొప్పిని తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కూడా. అందుకే శాండల్ వుడ్ పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేసి దాన్ని దద్దుర్లపై రాస్తే వాటి వల్ల తలెత్తిన మంట, నొప్పులు తగ్గుతాయి.
మండే చర్మంపై బేకింగ్ సోడా (సోడియం బైకార్బోనేట్) ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది వేసవిలో వచ్చే దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలకు మంచి వంటింటి చిట్కా. గోరువెచ్చటి నీళ్లల్లో మూడు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి నాననిచ్చి 20 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి.
అలొవిరా యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడమే కాదు శక్తివంతమైన యాంటిసెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది చర్మంపై ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటూ చర్మాన్ని చల్లబరుస్తుంది. నొప్పిని, వాపును తగ్గిస్తుంది. మీరు చేయవలసిందల్లా అలొవిరా జెల్ ను నేరుగా దద్దుర్లపై రాస్తే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది.
టాల్కమ్ పౌడర్ వాడడం వల్ల చమట తగ్గుతుంది. ఈ టైములో చర్మంపై సెంట్లను అస్సలు వాడకూడదు. అవి చర్మాన్ని బాగా ఇరిటేట్ చేస్తాయి. చెమట బాగా పట్టే చంకలు, వీపు, మోకాళ్ల వెనుక భాగాలలో , తొడలపై టాల్కమ్ పౌడర్ కొద్దిగా చల్లుకోవాలి.
వేప కూడా పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటిమైక్రోబియల్, యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. వేపపొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. దీన్ని దద్దుర్లపై రాసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆతర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లల్లో వేప పొడి కలిపి వాటితోస్నానం చేయొచ్చు కూడా. చర్మంపై దద్దుర్లు ఇన్ఫెక్షన్ కు గురయినపుడు వైద్యులను వెంటనే
సంప్రదించాలి.
కూలర్లు, ఫ్యాన్లు వాడడం వల్ల గది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎండల్లో శరీరానికి కావాలసిన చల్లదానాన్ని అందిస్తాయి.