వేసవిలో చర్మ రక్షణ ఇలా…
వేసవితో పాటు సూర్య తాపం రోజు రోజుకూ సర్వత్రా పెరుగుతోంది. సూర్య కిరణాలు చర్మంపై దుష్ప్రభావం చూపుతాయి. అంతేకాదు ఎండాకాలంలో తీవ్ర చమట సమస్యతో బాధపడతాం. చర్మరంధ్రాలు కూడా పెద్దవై రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. దుమ్ముధూళితో, తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో చర్మం బాగా దెబ్బతింటుంది. అందుకే వేసవిలో చర్మం దెబ్బతినకుండా ఆరోగ్యంగా, సున్నితంగా ఉండడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి.
సంవత్సరం పొడుగుతా సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చర్మానికి సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవాలి. సూర్యునిలోని అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని పాడుచేయడమే కాదు చర్మం మ్రుదుత్వాన్ని పోగొడతాయి. దీంతో తొందరగా వయసు మీద పడి పెద్దవాళ్లల్లాగ కనిపిస్తాం. దాంతోపాటు ట్యానింగ్ సమస్య కూడా ఎదురవుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్య సైతం మనల్ని వేధిస్తుంది. ఈ సమస్యలేవీ తలెత్తకుండా ఉండాలంటే ఎస్ పిఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ను చర్మానికి రాసుకోవాలి. బయటకు వెళ్లే పదిహేను నిమిషాల ముందు సన్ స్ర్కీన్
శరీరానికి , ముఖానికి రాసుకోవాలి. రోజులో తరచూ దీన్ని చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. అందుకే రోజులో రెండు మూడు గంటలకు ఒకసారి ముఖానికి, శరీరానికి సన్ స్క్రీన్ రాసుకోవాలని చర్మనిపుణులు చెపుతున్నారు. టచ్ అప్ లు చేసుకోవడానికి, మేకప్ వేసుకునేటప్పుడు సన్ స్ర్కీన్ స్టిక్ బాగా ఉపయోగపడుతుంది.
వేసవిలో లైటర్ స్కిన్ కేర్ రొటీన్ మంచిది. సింపుల్ క్లీన్సింగ్, మాయిశ్చరైజింగ్ పద్ధతులను పాటించాలి. ఇలా చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉండడంతోపాటు ఎంతో కాంతివంతం అవుతుంది. మేకప్ విషయంలో హెవీ ఫౌండేషన్ వేసుకోకుండా జంటిల్ స్కిన్ కేర్ ను అనుసరిస్తేనే మంచిది. సమస్యలున్న ప్రదేశంపై కన్సీలర్ వాడాలి. చర్మాన్ని సురక్షితంగా ఉంచే బ్యూటీ ఉత్పత్తుల గురించి చర్మనిపుణులను అడిగి తదనుగుణంగా ఉపయోగించాలి.
చలికాలంలో మల్లే వేసవికాలంలో కూడా చర్మానికి నిత్యం మాయిశ్చరైజింగ్ అవసరం. చర్మం మెరుస్తూ, పట్టులా ఉండాలంటే హైడ్రేషన్ తప్పనిసరిగా కావాలి. క్లీన్సర్, టోనర్ కు సరిపడే తేలికపాటి మాయిశ్చరైజర్ ని వాడాలి.
చర్మంలోని సహజసిద్ధమైన నూనెలను కాపాడే చర్మ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. చర్మంలోని సహజసిద్ధమైన ఆయిల్స్ లోపిస్తే చర్మం దెబ్బతింటుంది. గాఢమైన సబ్బుతో ఒళ్లు రుద్దుకోవడం వల్ల చర్మంలోని మాయిశ్చరైజింగ్ గుణం పోతుంది. దాంతో చర్మం మొత్తం పొడారినట్ట అయి ఇరిటేషన్తో ఇబ్బంది పడతారు. గ్లిజరిన్ ఉండే సబ్బులు వాడడంవల్ల చర్మంలోని మాయిశ్చరైజర్ పోదంటున్నారు
బ్యూటీ నిపుణులు.
వారానికి ఒకసారి తప్పనిసరిగా చర్మాన్ని ఎక్స్ ఫోయిలేట్ చేసుకోవాలి. దీని వల్ల చర్మంపై ఉండే మ్రుతకణాలు పోయి చర్మం మ్రుదువుగా తయారవుతుంది. కాంతివంతమవుతుంది. మీ చర్మ స్వభావానికి అనుగుణమైన ఎక్స్ ఫొయిలెంట్ ను చర్మనిపుణుల సలహాతో వాడాలి. ఎక్స్ ఫొయిలేట్ చేసుకున్న చర్మం పై సూర్యకిరణాల ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి.
మీరు తినే ఆహారంలో యాంటాక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలి. యాంటాక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా, పట్టులా ఉంచుతాయి. క్యారట్లు, బెర్రీలు, పాలకూర వంటి వాటిల్లో సహజసిద్ధమైన యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి.
వేసవిలో నీళ్లు బాగా తాగాలి. చర్మానికి హైడ్రేషన్ బాగా అందితే చాలా మంచిది. కనీసం రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసులు నీళ్లు తాగాలి. పుచ్చకాయ, కీరకాయ వంటి నీరు బాగా ఉన్న పండ్లు తినాలి. ప్రతిరోజూ వ్యాయామాలు చేయాలి.