అవిశె గిజంలతో మీ చర్మం అదరహో..
సూపర్ ఫుడ్స్ లో అవిశె గింజలు ముందాటయని అందరికీ తెలుసు. అయితే చర్మ సౌందర్యాన్ని కూడా పెంచి పోషించే బ్యూటీ సీక్రెట్స్ అవిశె గింజల్లో చాలా ఉన్నాయంటున్నారు బ్యూటీ నిపుణులు. అవిశె గింజలు చర్మాన్ని ఎంతో అందంగా ఉంచుతాయి. అవిశెల్లో యాంటాక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ బోలెడు
ఉంటాయి. యాంటి ఏజింగ్ క్రీముల్లో కూడా వీటిని వాడతారు. అవిశె గింజల పొడిని నిత్యం ఒక స్పూను తింటే చాలు మీ వయసు కనపడకుండా యంగ్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే చాలామంది మహిళలు చర్మంపై దద్దుర్లతో తరచూ బాధపడుతుంటారు. అవిశె గింజల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన సాంత్వననిస్తాయి.
అంతేకాదు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఈ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. అవిశె గింజల పొడిలో కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపి పేస్టులా చేసి దాన్ని చర్మంపై వాపు ఉన్నచోట, అలాగే ఇరిటేషన్, దద్దుర్లు, రెడ్ నెస్ ఉన్న చోట్ల రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. హార్మోనల్ మార్పులు, బహిష్టుల కారణంగా చాలామంది అమ్మాయిలు యాక్నే బారిన పడుతుంటారు. సాధారణంగా సరిపడినంత నూనె పదార్థాల వల్ల చర్మానికి మాయిశ్చరైజర్ అందుతుంది. కానీ అదే నూనె పదార్థాలు ఎక్కువైతే చర్మంపై దుమ్ము, మలినాలతో పాటు జిడ్డు కూడా బాగా పేరుకుంటుంది. వీటి వల్ల చాలామంది యాక్నే బారిన పడతారు. ఈ సమస్య పోవాలంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వేగించిన, లేదా పొడి చేసిన అవిశెగింజలు తీసుకుంటే యాక్నే తలెత్తదు.
అవిశె గింజలు చర్మాన్ని మెరిపిస్తాయి. మంచి ఎక్స్ ఫొయిలెంట్స్ గా కూడా వీటికి పేరు. చర్మంపై చేరిన మృతకణాలను పోగొడతాయి. అంతేకాదు అవిశె గింజలు స్కిన్ టోన్ ను సైతం మెరుగుపరుస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మలుస్తాయి. అవిశెగింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. అవాంఛనీయమైన ట్యాన్ ను సైతం పోగొట్టి స్కిన్ టోన్ ను మెరిసేలా చేస్తుంది. ఇక అవిశె గింజలతో చేసే ఫేస్ ప్యాకులు చర్మానికి చేసే మేలెంతో. అవిశెగింజలు, నీరుకలిపిన మిశ్రమం చర్మాన్ని బిగువుగా ఉండేలా చేస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ అవిశె గింజలు, కప్పుకు మూడవవంతు నీళ్లు, చిన్న ప్లాస్టిక్ బౌల్ ను తీసుకోవాలి. నీళ్లను మరిగించి అందులో అవిశె గింజలు వేసి దాన్ని బాగా కలుపుతుండాలి. కొంచెంసేపైన తర్వాత శుభ్రమైన గుడ్డను బౌల్ పైన చుట్టి మూడు నుంచి నాలుగు గంటలు అలాగే వదిలేయాలి. ఆ గుడ్డపై పేరుకున్న పేస్టును ముఖం, మెడభాగంలో సమానంగా పట్టించాలి. అది ఎండిన తర్వాత మళ్లా ఆ పేస్టును చిక్కగా ఇంకో పొర వేయాలి. అలా మాస్కును నాలుగు మార్లు చిక్కటి లేయర్లుగా ముఖంపై వేసి ఆరనివ్వాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే బిగువైన, కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. అలాగే
మెరిసే చర్మానికి అవిశె గింజలు, బ్లూ క్లే మాస్కు కూడా బాగా పనిచేస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ అవిశె గింజలు, ఒక టస్పూన్ బ్లూ క్లే, రెండు లేదా నాలుగు చుక్కల రోజ్ వాటర్ రెడీగా పెట్టుకోవాలి. కొన్నినీళ్లల్లో అవిశెగింజలు వేసి రాత్రంతా నానబెట్టాలి. అందులో మిగిలిన పదార్థాలను పొద్దున్న కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ మాస్కును ముఖాన్ని, మెడను బాగా కడిది రెండింటికీ
పట్టించాలి. తర్వాత దాన్ని పదిహేను లేదా 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కొని బాగా పొడిగా తుడుచుకోవాలి. మెరిసే చర్మం కావాలంటే వారానికి ఒకసారి ఇలా అవిశె గింజల ఫేస్ మాస్కు వేసుకోవాలి. చర్మం శుభ్రంగా ఉండాలంటే అవిశెగింజలు, గుడ్డు కలిపిన ఫేస్ మాస్కు బాగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అవిశె గింజల పొడి, ఒక గుడ్డును రెడీ పెట్టుకోవాలి. గుడ్డును పగలగొట్టి అవిశెగింజల పొడిలో వేసి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖం కడుక్కుని పొడిగా తుడుచుకోవాలి. తర్వాత మీరు నిత్యం వాడే మాయిశ్చరైజర్ ను ముఖానికి పట్టించాలి. నెలకు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని రాసుకుంటే చర్మం శుభ్రమయి తళ తళ లాడుతూ ఎందరినో ఆకట్టుకుంటుంది.
యాక్నేతో బాధపడేవాళ్లకు కూడా అవిశెగింజలతో చేసే ఫేస్ మాస్కు ఉంది. దీన్ని తయారుచేయడానికి ఒక టేబుల్ స్పూన్ అవిశెగింజలు, రెండు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె రెడీ పెట్టుకోవాలి. అవిశె గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. పొద్దున్న లేచిన తర్వాత దాన్ని తేనె, నిమ్మరసం, మిగతా పదార్థాలతో పాటు కలిపి మెత్తగా చేయాలి. ఆ పేస్టును ముఖంపై పూసి కొన్నినిమిషాల పాటు మునివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది అరడానికి అరగంట పడుతుంది. ఆతర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కుని పొడిగా తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే యాక్నే సమస్య
తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అవిశెగింజలు, దాల్చినచెక్క పొడి, పెరుగు మిశ్రమాన్ని కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ అవిశెగింజల పొడి, ఒక టీస్పూను దాల్చినచెక్క పొడి, ఒక టేబుల్ స్పూను పెరుగును రెడీ పెట్టుకోవాలి.
వీటన్నింటినీ కలపి మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి, మెడకు బాగా పూసుకొని పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. అది బాగా ఆరిన తర్వాత సాధారణ నీటితో ముఖం కడుక్కుని పొడిగా తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు రాసుకుంటే మీ చర్మం యంగ్ లుక్స్ తో మెరిసిపోతుంది.