Foods For Eyes: వయసు పెరుగుతున్న కొద్దీ కళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో కళ్ళు పొడిబారడం, అలసట వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితుల్లో చికిత్సతో మాత్రమే కాకుండా సరైన ఆహారంతో కూడా కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. డైట్ లో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పాలకూర
పాలకూరలో లూటీన్,జియాక్సంతిన్ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కళ్ళను హానికరమైన uv కిరణాలు, నీలి కాంతి నుండి రక్షిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఇనుము, విటమిన్ ఎ, పోలేట్ వంటి పోషకాలు కంటి అలసట, పొడిబారడాన్ని తగ్గించడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
వాల్‌నట్
వాల్‌నట్‌లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి కణాలను బలపరుస్తాయి. అంతేకాకుండా కళ్ళల్లో వాపు, పొడిబారడం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. వాల్ నట్ రెటీనా పనితీరును సైతం మెరుగుపరుస్తుంది.
నారింజ
నారింజ పండును విటమిన్ సి అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వయసు సంబంధిత వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజ తినడం లేదా రసం తాగడం ద్వారా కంటి చికాకు, అలసట, పొడిబారడం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
Also read: Lemon juice for health: మీకు ఆ సమస్య ఉందా..? అయితే నిమ్మరసాన్ని వదిలేయండి..!
క్యారెట్లు
కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మన డైట్ లో క్యారెట్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది కళ్ళ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్యారెట్లు తినడం వల్ల కళ్ళ అస్పష్టత, రాత్రి అంధత్వం కంటిశుక్లం వంటి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.
గుడ్డు
గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. గుడ్డు పచ్చ సోనాలో ఉండే లుటిన్, జియాక్సంతిన్, విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు కళ్ళను అనేక తీవ్రమైన వ్యాధులనుండి రక్షిస్తాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తినడం ద్వారా కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు గుడ్డు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.


