Thursday, April 18, 2024
Homeహెల్త్Unwanted Facial hair: ముఖంపై అవాంఛిత రోమాలున్నాయా?

Unwanted Facial hair: ముఖంపై అవాంఛిత రోమాలున్నాయా?

వీటిలో మీకు నచ్చినది ట్రై చేసి రిజల్ట్ చూడండి

ఫేషియల్ హెయిర్ ఉంటే ముఖం చూడడానికి బాగుండదు. అందుకే వాటిని తొలగించుకోవడానికి చాలామంది అమ్మాయిలు తపన పడుతుంటారు. వాక్సింగ్, థ్రెడింగ్ ల వంటివి చేయించుకుంటుంటారు. అందుకోసం అవి నొప్పిగా ఉన్నా భరిస్తారు. నొప్పి లేకుండా ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లో అనుసరించే కొన్ని సహజమైన చిట్కాలు ఉన్నాయి. వీటి వల్ల నొప్పి ఉండదు. చర్మంపై ఎలాంటి సైడ్ ఎఫెక్టులు తలెత్తవు. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారికి కొన్ని నేచురల్ పదార్థాలు కూడా చర్మంపై ఇరిటేషన్ వచ్చేలా చేయొచ్చు. అందుకే ఫేషియల్ హెయిర్ పోగొట్టుకునేందుకు నేచురల్ పద్ధతులను అనుసరించేటప్పుడు ముందుగా చర్మంపై ప్యాచ్ టెస్టు చేసుకోవడం మంచిది.

- Advertisement -

ఫేషియల్ చర్మంతో బాధపడే వారిపై షుగర్, లెమన్ జ్యూసు పేస్టు బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ మిశ్రమాన్ని కలపాలి. ఇందులోని షుగర్ పార్టికల్స్ చర్మానికి ఎక్స్ పొయిలేటింగ్ ఏజెంటుగా పనిచేస్తాయి. ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని తీసేస్తే అవాంఛిత రోమాలు పోతాయి. ఇలా ఈ పద్ధతిని రోజు విడిచి రోజు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమంలోని నిమ్మరసం వల్ల చర్మం టోన్ కాంతివంతమవుతుంది. నిమ్మరసం వెంట్రుకలను బాగా బ్లీచింగ్ చేస్తుంది. పొడిచర్మం వాళ్లు ఈ పేస్టును 20 నిమిషాలకు మించి చర్మంపై ఉంచకూడదు.

తేనె, నిమ్మరసాల మిశ్రమం కూడా ఫేషియల్ హెయిర్ ను పోగొట్టడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫేషియల్ హెయిర్ ను శాశ్వతంగా తొలగించడంలో తేనె బాగా పనిచేస్తుంది. నిమ్మరసం, షుగర్, తేనె మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. అవసరమైతే కొన్ని నీళ్లను కూడా దీనికి చేర్చి మైక్రోవేవ్ లో మూడు నిమిషాలు వేడిచేయాలి. అవాంఛిత రోమాలు ఉన్న చోట మైదా కొద్దిగా చల్లి ఈ పేస్టును పూయాలి. తర్వాత దానిపై గుడ్డ పెట్టి అపోజిట్ దిశలో గట్టిగా లాగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఓట్మీల్, తేనె, నిమ్మరసాల మిశ్రమంతో కూడా అవాంఛిత రోమాలు పోతాయి. మెత్తగా చేసిన ఓట్మీల్, నిమ్మరసం, తేనెలు మూడింటినీ బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. అవాంఛిత రోమాలు పెరుగుతున్న చోట ఈ పేస్టును అపోజిట్ దిశగా గుండ్రంగా రుద్దుతూ మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఓట్స్ అవాంఛిత రోమాలను పోగొడుతుంది. చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని తేనె అందిస్తుంది. మిగిలి ఉన్న అవాంఛిత రోమాలను నిమ్మరసం పూర్తిగా బ్లీచ్ చేస్తుంది. రోజు మార్చి రోజూ ఈ పేస్టును ముఖానికి అప్లై చేస్తే ఫేషియల్ హెయిర్ మెల్లగా పోతుంది. పసుపు, పాలతో కూడా ముఖంపై వచ్చిన అవాంఛిత రోమాలను పోగొట్టవచ్చు.

బియ్యప్పిండి తీసుకుని అందులో పసుపు, పాలు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట పూసి బాగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల బియ్యప్పిండి ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను పోగొడుతుంది. పాలు చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. పసుపు చర్మంపై యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది.

ఎగ్ వైట్స్ కూడా ముఖంపై ఉండే వెంట్రుకలను పోగొడతాయి. తెల్లసొన, కార్న్ స్టార్చ్, షుగర్ మూడింటినీ బాగా కలపాలి. అవాంఛిత రోమాలు ఉన్న చోట ఈ పేస్టును సమాంతరంగా అప్లై చేసి బాగా ఆరనివ్వాలి. తర్వాత దాన్ని తీసేసి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఈ మాస్కును వారానికి రెండుసార్లు అప్లై చేసుకుంటే ముఖంపై మంచి ఫలితం చూస్తారు. ఇందులో వాడిన మూడు పదార్థులు అవాంఛిత రోమాలను పోయేలా చేస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు, యాక్నే సమస్య ఉన్న చర్మం ఉన్నవారు ఈ మాస్కును వాడొద్దు.

బొప్పాయి, పసుపు రెండింటినీ కలిపి పేస్టులా చేసి దాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట పూయాలి. ఇరవై నిమిషాల పాటు వ్రుత్తాకారంలో ఆ ప్రదేశంలో మసాజ్ చేసిన తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ వల్ల అవాంఛిత రోమాలు రాలిపోతాయి. ఈ మాస్కును వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో పసుపును చాలాకొద్దిగా మాత్రమే కలపాలి.


అలొవిరా గుజ్జులో బొప్పాయి పేస్టు, శెనగపిండి, ఆవనూనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని బాగా ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో కడగాలి. తర్వాత ఆలివ్ నూనెతో ముఖాన్ని మసాజ్ చేయాలి. మూడు నెలల పాటు వారానికి మూడు లేదా నాలుగుసార్లు ఈ పేస్టును ముఖానికి పూయాలి. బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ వల్ల జుట్టు ఊడుతుంది. అలొవిరా జెల్ చర్మానికి కావలసినంత సాంత్వనను అందిస్తుంది. ఈ మాస్కు రాసుకున్న తర్వాత సోప్ వాడొద్దు. కొంతమందికి ఆవనూనె చర్మంపై ఇరిటేషన్ తెస్తుంది. అందుకే దీన్ని ముఖానికి పూసుకునే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం మంచిది.

లవండర్, టీ ట్రీ ఆయిల్ రెండూ కలిపి పేస్టులా చేసి దాన్ని అవాంఛనీయ రోమాలు ఉన్న చోట రాయలి. దీన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు అప్లై చేయాలి. ఇలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. యాక్నే సమస్య ఉన్న వారు ఈ మాస్కుకు దూరంగా ఉండడం మంచిది. కాంబినేషన్, నార్మల్, డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఈ చిట్కాను అనుసరించవచ్చు. తులసి ఆకులు, ఉల్లిపాయ కలిపి ఆ పేస్టును అవాంఛనీయ రోమాలు ఉన్న ప్రదేశంలో పూసి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని నెలల పాటు వారానికి మూడుసార్లు ఇలా చేయాలి.

తులసితో కలిపి ఉల్లిపాయను వాడడం వల్ల జుట్టు పెరుగుదల ఆగుతుంది. అన్నిరకాల చర్మం ఉన్నవారూ ఈ చిట్కాను అనుసరించవచ్చు. అయితే ఇందులో ఉపయోగించిన రెండు పదార్థాలు స్కిన్ ఇరిటేషన్ ను రేపుతాయి కాబట్టి ఈ పేస్టును అప్లై చేసుకునే ముందర ప్యాచ్ టెస్టు చేసుకోవడం మంచిది. బార్లీ, పాలు కాంబినేషన్ తో కూడా ముఖంపై అవాంఛిత రోమాలను అరికట్టవచ్చు. పాలు, బార్లీ, నిమ్మరసం ఈ మూడింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి పూసుకుని పొడారిపోయే వరకూ దీన్ని ముఖంపై మసాజ్ చేయాలి. వారానికి మూడుసార్లు దీన్ని అప్లై చేయొచ్చు. ఈ పేస్టు అవాంఛిత రోమాలకు గట్టిగా పట్టుకుని స్క్రబ్ చేసేటప్పుడు ఊడివస్తుంది. సెన్సిటివ్ చర్మం ఉన్నవాళ్లు ఈ కిటుకును అనుసరించవద్దు.

శెనగల పిండి, పసుపు కలిపిన పేస్టును ముఖానికి రాసుకున్నా ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు పోతాయి. ఈ పేస్టును ముఖంపై రాసుకుని కాస్త ఆరిన తర్వాత తడి తువ్వాలుతో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. రోజు విడిచి రోజు ఈ కిటుకును అనుసరించాలి. దీని ఫలితాలు ముఖంపై కనిపించడం మొదలెట్టగానే వారం లేదా పదిరోజులకొకమారు ఈ పేస్టును ముఖానికి అప్లై చేసుకోవాలి. వెంట్రుకలు
రాలిపోయేట్టు శెనగల పిండి చేస్తుంది. భవిష్యత్తులో ముఖంపై అవాంఛిత రోమాలు పెరగకుండా పసుపు నియంత్రిస్తుంది. జిడ్డుచర్మం వారిపై ఈ కిటుకు బాగా పనిచేస్తుంది.

యాక్నే సమస్య ఉన్నవారు, సున్నితమైన చర్మం ఉన్న వారు దీనికి దూరంగా ఉంటే మంచిది. నేరేడు పండ్ల పొడి, తేనె రెండింటినీ కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకున్నా కూడా అవాంఛిత రోమాల సమస్య పరిష్కారమవుతుంది. ఈ రెండింటినీ కలిపి మెత్తని పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. బాగా ఆరేవరకూ దాన్ని అలాగే ఉంచుకోవాలి. అది బాగా ఆరిన తర్వాత ముఖంపై వ్రుత్తాకారంలో మసాజ్ చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి మూడుసార్లు ముఖానికి పూసుకోవాలి. అవాంఛిత రోమాలకు ఈ పేస్టు గట్టిగా పట్టుకుంటుంది. ఈ చిట్కాను జిడ్డు చర్మంపై ప్రయోగించవద్దు. అలా చేస్తే యాక్నే సమస్య తలెత్తే అవకాశం ఉంది.


వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి దాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట అప్లై చేయాలి. అరగంట పాటు దాన్ని అలాగే ఉంచి ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. రోజుకు ఒకసారి ఈ రెమిడీని అనుసరించాలి. దీనికి సంబంధించి సైంటిఫిక్ నిర్ధారణలేమీ బయటపడకపోయినా వెంట్రుకలు ఊడిపోయేలా చేయడంలో వెల్లుల్లి శక్తివంతంగా పనిచేయడం చూస్తున్నాం. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు ఈ చిట్కాను అనుసరించవద్దు. అలాగే ఈ కిటుకును అనుసరించే వాళ్లు వెల్లుల్లిని అవాంఛిత రోమాలు ఉన్న చోట అప్లై చేసే ముందు ప్యాచ్ పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల చర్మంపై ఎలర్జిక్ రియాక్షన్లు తలెత్తే అవకాశం ఉంది.

పెరుగు, శెనగపిండి, పసుపులను కలిపి పేస్టులా చేసి రాసుకున్నా కూడా ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు పోతాయి. ఈ పేస్టును ముఖంపై రాసుకుని కొద్దిగా ఆరిన తర్వాత అవాంఛనీయ రోమాలు ఉన్న ప్రదేశంలో ఆపోజిట్ దిశగా గుండ్రంగా మసాజ్ చేయాలి. తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజూ ముఖానికి ఈ పేస్టును అప్లై చేసుకోవచ్చు. ఈ పేస్టు బాగా ఆరి గట్టిపడి చర్మంపై రుద్దేటప్పుడు అవాంఛిత రోమాలు రాలిపోయే అవకాశం ఉంది. అన్ని రకాల చర్మం వారికీ ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్టులు కూడా ఏమీ ఉండవు.

కమలాపండు తొక్క పొడి, ఓట్మీల్ పొడి, కొద్దిగా నీరు మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో పూయాలి. ఈ పేస్టు కొంతమేర ఆరిన తర్వాత చర్మంపై గుండ్రంగా మసాజ్ చేయాలి. తర్వాత నీళ్తో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తగ్గుతాయి. కమలాపండు తొక్కల పొడి నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది. ఓట్స్ చర్మన్ని ఎక్స్ ఫొయిలేట్ చేస్తుంది. చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను పోగొడుతుంది. ఈ మాస్కు అన్ని రకాల చర్మంపై బాగా పనిచేస్తుంది. అయితే కమలాపండు తొక్కల పొడి వల్ల కొంతమందికి చర్మంపై ఇరిటేషన్ తలెత్తుతుంది కాబట్టి దాన్ని అప్లై చేసుకునే ముందు చర్మంపై ప్యాచ్ టెస్టు చేసుకోవడం మంచిది.


శెనగపిండి, రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే ముఖంపై అవాంఛిత రోమాలు పెరగవు. రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బౌల్ లో పోసి బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని బాగా పొడారి పోయేవరకూ ఉంచుకోవాలి. తర్వాత చర్మంపై వేళ్లతో రబ్ చేయడం వల్ల అవాంఛిత రోమాలు రాలిపోతాయి. వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఇలా చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News