Coconut Water Vs Health: కొబ్బరి నీరు చాలా మందికి ఆరోగ్యానికి మంచివనే విషయం తెలిసిందే. వేడికాలంలో దాహం తీరుస్తూ శరీరానికి తగినంత హైడ్రేషన్ కలిగించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో సహజమైన చక్కెరలు, ఖనిజాలు, ముఖ్యంగా పొటాషియం, సోడియం ఉండటం వల్ల ఇది ఆరోగ్యవంతమైన పానీయంగా చెబుతారు. అయితే, కొంతమందికి మాత్రం ఇది ఆరోగ్యానికి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.
డయాబెటిస్…
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సాధారణ 200 మిల్లీ లీటర్ల కొబ్బరి నీటిలో సుమారు 6 నుండి 7 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది ఫ్రూట్ జ్యూస్‌లతో పోలిస్తే తక్కువే అయినా, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు తరచుగా కొబ్బరి నీరు తీసుకుంటే, షుగర్ లెవల్స్ పై ప్రభావం చూపవచ్చు. అందువల్ల డాక్టర్ సలహా తీసుకుని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం ఉత్తమం.
చర్మం ఎర్రబడటం, వాపు రావడం
కొంతమందిలో కొబ్బరి నీటిని తీసుకున్న తర్వాత చర్మం ఎర్రబడటం, వాపు రావడం, దురద, శ్వాసలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అనాఫిలాక్సిస్ అనే ప్రమాదకర పరిస్థితి రావచ్చు. ఫుడ్ అలెర్జీలు ఉన్నవారు తొందరపడకుండా వైద్యుల సూచన మేరకు మాత్రమే కొబ్బరి నీరు తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు
అలాగే, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీటిని తాగేటప్పుడు ద్విగుణీకృతంగా ఆలోచించాలి. ఇందులో అధికంగా ఉండే పొటాషియం, కిడ్నీలు పూర్తిగా పనిచేయని వారిలో శరీరం నుంచి బయటకు వెళ్లకపోవచ్చు. దాంతో రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి హైపర్‌కలేమియా అనే పరిస్థితి రావచ్చు. ఇది గుండె లయలో మార్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలకు దారితీయవచ్చు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు తమ నెఫ్రాలజిస్ట్ సలహాతోనే కొబ్బరి నీరు తీసుకోవాలి.
ఒకవేళ మీరు తరచూ జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటే, కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశముంది. ఇది శరీరాన్ని చల్లబరచే లక్షణం కలిగిఉండటంతో, ఫ్లూ లేదా జలుబు సమయంలో తాగడం వల్ల కోలుకునే ప్రక్రియ ఆలస్యం కావచ్చు. దీని వలన మీరు మరింత బలహీనంగా అనిపించుకోవచ్చు. శీతాకాలం వంటి సమయంలో కొబ్బరి నీరు తాగడం మానేయడం ఉత్తమం.
అధిక రక్తపోటుతో బాధపడేవారు…
అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీరు తాగే ముందు మెడికల్ సలహా తీసుకోవడం తప్పనిసరి. కొబ్బరి నీరు రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉన్నా, కొన్ని రకాల రక్తపోటు మందులతో కలసి తీసుకుంటే, పొటాషియం స్థాయి అధికమై మానసిక, శారీరక సమస్యలు తలెత్తవచ్చు. ఇది ఛాతీలో నొప్పి, గుండె బీట్‌లు అసమర్థంగా ఉండటం లాంటి పరిస్థితులకు దారితీయవచ్చు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమందికి వైద్యులు ఎలక్ట్రోలైట్ పరిమిత ఆహారం పాటించమని సూచిస్తారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు లేదా కిడ్నీ చివరి దశలలో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. అలాంటి వారు కొబ్బరి నీరు తాగితే, పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాల స్థాయి అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను దెబ్బతీసి అలసట, కండరాల ఆకస్మిక నొప్పులు వంటి సమస్యలకు దారితీయవచ్చు.


