Monday, May 20, 2024
Homeఇంటర్నేషనల్America too busy with wars: వరుస యుద్ధాలతో అమెరికా బాగా బిజీ

America too busy with wars: వరుస యుద్ధాలతో అమెరికా బాగా బిజీ

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికాకు అత్యాసక్తి మరి

ఇతర దేశాలతో తాను చేస్తున్న యుద్ధాలతో అమెరికా ఉక్కిరిబిక్కిరయిపోతోంది. ఏదో ఒక యుద్ధంతో ప్రమేయం పెట్టుకోక తప్పడం లేదు. అసలే ఆర్థికంగా కష్టనష్టాల్లో ఉన్న అమెరికాకు ఈ యుద్ధాల ఖర్చు కూడా మీద పడి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది ప్రస్తుతం అమెరికా పరిస్థితి. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధం క్రమంగా ఇజ్రాయెల్‌, పాలస్తీనా పరిధిని మించి విస్తరించిపోతున్నట్టు దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌ మద్దతుతో యెమెన్‌ విప్లవకారులు హౌతీలు ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై దాడులు చేయడం ఇందుకు ప్రబల నిదర్శనం. ఈ హౌతీల మీద అమెరికా దాడులు సాగిస్తుండడంతో ఈ యుద్ధం గాజాకు మాత్రమే పరిమితమయ్యేలా కనిపించడం లేదు. యెమెన్‌ మీద చాలావరకు ఆధిపత్యం కలిగిన ఈ హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో కలకలం సృష్టించేందుకు అనేక రకాలుగా దాడులు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా దాడులు మరీ విజృంభించడంతో పది మంది ఉగ్రవాదులు ఇంతవరకూ ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా తాము బాబ్‌ ఎల్‌ మాందేబ్‌ జలసంధి మీదుగా వెళ్లే రవాణా నౌకలపై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హౌతీలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ కు చేరాలన్న పక్షంలో తప్పనిసరిగా ఎర్ర సముద్రంలోని బాబ్‌ ఎల్‌ మాందేబ్‌ జలసంధి గుండానే రవాణా సాగించాల్సి ఉంటుంది.
కాగా, గత నవంబర్‌ నుంచి ఇంతవరకూ 20 వాణిజ్య నౌకలు హౌతీల నిర్బంధంలోకి వెళ్లి పోయాయి. భారతదేశానికి చెందిన ఒక రసాయనాల నౌక కూడా వారి నిర్బంధంలోకి వెళ్లిపోవడం జరిగింది. ఫలితంగా, ప్రపంచంలో అతి పెద్ద నౌకా రవాణా కంపెనీలైన మెర్సెక్‌, హపాగ్‌-లాయ్‌డ ఎం.ఎస్‌.సి కంపెనీలు ఎర్ర సముద్రం గుండా తమ నౌకలు రవాణా చేయడాన్ని విరమించి, ఆఫ్రికా ఖండం వైపుగా చుట్టు తిరిగి గమ్యస్థానం చేరేలా తమ నౌకల రవాణాన్ని మార్చివేశాయి. మధ్య ధరా సముద్రానికి, అరేబియన్‌ సముద్రానికి మధ్య ఒక లింకుగా ఉన్న ఎర్ర సముద్రంలో ఇప్పుడు 35 శాతానికి నౌకల రవాణా పడిపోయింది. ఇప్పుడు నౌకలలో ఎక్కువ భాగం ఆఫ్రికాను చుట్టు తిరిగి వెడుతుండడంతో రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. అమెరికా అత్యంత భద్రతతో ఎర్ర సముద్రంలోని సూయెజ్‌ కాలువ నుంచే తమ నౌకల రవాణాను కొనసాగిస్తోంది.
నిజానికి హౌతీల మీద అమెరికా ప్రస్తుతం ఒంటరి పోరాటం సాగిస్తోంది. అమెరికాకు ఉన్న పరిమితుల వల్ల ఇది ఎక్కువ కాలం సాగకపోవచ్చు. నౌకల రవాణాకు ఎర్ర సముద్రం మీద ఆధారపడిన ఏ దేశమూ అమెరికాకు చెందిన ప్రత్యేక కార్యాచరణ బృందాలకు మద్దతుగా రావడం లేదు. చివరికి సూయజ్‌ కాలువ రవాణా మీదే తన ఆర్థిక వ్యవస్థ అంతా ఆధారపడినప్పటికీ ఈజిప్టు కూడా ఈ కార్యాచరణ బృందాలకు వత్తాసుగా రావడం లేదు. నిజానికి సూయజ్‌ కాలువలో నౌకల రవాణా తగ్గిపోయినందువల్ల ఈజిప్టు ఆర్థిక వ్యవస్థ చాలావరకు కుప్పకూలిపోయింది. పాలస్తీనా మీద యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్‌ దేశానికి అమెరికా మద్దతునివ్వడాన్ని చాలా దేశాలు హర్షించడం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో గత పదకొండు వారాల కాలంలో 22,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, యెమన్‌ వైపున ఉన్న ఎర్ర సముద్ర తీరం మీద హౌతీలకే పట్టు ఉన్నందువల్ల, వారికి ఇక్కడి జలసంధులన్నీ కరతలామలకం. దాడులు చేయడంతో పాటు, తప్పించుకోవడానికి కూడా వారికి అనేక మార్గాలు క్షుణ్ణంగా తెలిసి ఉన్నాయి. తీర ప్రాంతం నుంచి దాదాపు 275 కిలోమీటర్ల వరకు వారికి తెలియని సముద్ర మార్గం లేదు.
ఇది ఇలా ఉండగా, గత కొన్ని వారాల్లో అమెరికా ప్రత్యేక కార్యాచరణ బృందాలు హౌతీలకు చెందిన అనేక డ్రోన్లను, క్షిపణులను కూల్చివేయడం జరిగింది. అయినప్పటికీ వెనక్కు తగ్గకుండా హౌతీలు అమెరికా సైనిక బృందాల మీద తమ దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవేళ అమెరికా సైన్యాలు యెమెన్‌ మీద దాడులు సాగించినప్పటికీ హౌతీలు వెనుకపట్టు పడతారా అన్నది సందేహమే. ఈ హౌతీలు దాదాపు ఏడేళ్ల పాటు సౌదీ దాడులను అనుభవించిన వారన్న విషయాన్ని విస్మరించకూడదు. ఎర్ర సముద్రంలోనూ, అరేబియా సముద్రంలోనూ భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలన్న పక్షంలో అమెరికా తప్పనిసరిగా గాజా నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించాల్సి ఉంటుంది. కనీసం కాల్పుల విరమణకు కృషి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, హౌతీలకు వ్యతిరేకంగా అనేక దేశాల మద్దతు కూడగట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అమెరికా గనుక పాలస్తీనా మీద ఇజ్రాయెల్‌ తో యుద్ధం ఆపించడానికి, హౌతీల మీద దాడులకు ప్రాధాన్యం పెంచడానికి కృషి చేసే పక్షంలో అమెరికా అనేక మిత్ర దేశాలను కోల్పోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News