BRICS Not Seeking Confrontation : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమి దేశాలపై అదనపు సుంకాల పిడుగు వేయగా, డ్రాగన్ దేశం చైనా దీటైన జవాబిచ్చింది. “బ్రిక్స్ ఏ దేశానికి వ్యతిరేకం కాదు, ఘర్షణను కోరుకోవడం లేదు” అని స్పష్టం చేసింది. అసలు ట్రంప్ ఎందుకు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు? చైనా ఎందుకు అంత ఘాటుగా స్పందించింది? బ్రిక్స్ కూటమి లక్ష్యాలేమిటి? ఈ వాణిజ్య సమరం ఎక్కడికి దారితీస్తుంది?
ట్రంప్ సుంకాల హెచ్చరిక: పిడుగు లాంటి ప్రకటన : బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న కీలక తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని బాంబు పేల్చారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా ఈ సుంకాలు వర్తిస్తాయని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేస్తూ, సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి (అమెరికా కాలమానం ప్రకారం) పలు దేశాలకు అధికారిక లేఖలు పంపనున్నట్లు, అందులో కొత్త టారిఫ్‌లు, అమలు తేదీని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. ఇది బ్రిక్స్ కూటమికి, ప్రపంచ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారింది.
చైనా కౌంటర్: ఘర్షణ కోరని బ్రిక్స్ : ట్రంప్ సుంకాల బెదిరింపులపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే మార్గంగా సుంకాలను ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇష్టమొచ్చినట్లు ప్రతీకార సుంకాలు పెంపు వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని, సుంకాలు సాకు చేసుకుని బెదిరించే విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. “బ్రిక్స్ కూటమి సమగ్రతను, దేశాల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. బ్రిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి ఒక వేదిక. ఏ నిర్దిష్ట దేశానికి వ్యతిరేకంగా బ్రిక్స్ పనిచేయదు, ఘర్షణను కోరుకోవడం లేదు” అని మావో నింగ్ నొక్కి చెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలు: బ్రెజిల్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీతో సహా పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు అమెరికా సుంకాల అంశాన్ని ప్రస్తావించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ట్రంప్ బ్రిక్స్ అనుకూల దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. వాణిజ్య సుంకాల విధింపు విషయంలో మొదటి నుంచి ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం విధితమే.. గతంలో చైనా-అమెరికాల మధ్య ప్రతీకార సుంకాల యుద్ధం జరిగింది. తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరగడంతో ఆ వివాదం కాస్త ముగిసింది. అయితే, మళ్ళీ ఇప్పుడు బ్రిక్స్ కూటమిని లక్ష్యంగా చేసుకుని ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త వాణిజ్య సమరానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బ్రిక్స్ కూటమి: పెరుగుతున్న ప్రాబల్యం : బ్రిక్స్ కూటమి మొదట బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో ప్రారంభమైంది. 2009లో బ్రిక్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది. గతేడాది ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు బ్రిక్స్ కూటమిలో చేరాయి. దీంతో బ్రిక్స్ కూటమిలో మరింత మంది సభ్యులు చేరినట్లైంది, దాని అంతర్జాతీయ ప్రాబల్యం కూడా పెరిగింది. తాజాగా 2025లో బ్రిక్స్ కూటమి బ్రెజిల్‌లోని రియోడీ జనీరోలో జరుగుతోంది.
బ్రిక్స్ సమావేశం: నేతల గైర్హాజరు, మోదీ ప్రాతినిధ్యం : ఈ బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సీసీ గైర్హాజరయ్యారు. 2012లో చైనా అధినేతగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ జిన్‌పింగ్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రాకపోవడం ఇదే మొదటిసారి. భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యారు. ఉగ్రవాదం, ఏఐ తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో అమాయక పర్యటకులపై జరిగిన పహల్గాం ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఏ మాత్రమూ సహించకూడదని, ఆ రక్కసిపై పోరాడటంలో ద్వంద్వ ప్రమాణాలను వీడాలని అభిప్రాయపడ్డాయి.


