నిత్యానంద స్వామి గురించి తెలియని వారుండరు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ స్వయంప్రకటిత ఆధ్యాత్మిక గురువు మరణించినట్లు తెలుస్తోంది. ఆయన రెండు రోజుల క్రితమే మృతి చెందినట్లు నిత్యానంద స్వామి సోదరి కుమారుడు సుందరేశ్వరన్ ఓ వీడియా ద్వారా తెలిపాడు. అయితే ఈ వార్తలో ఎంత నిజమో తెలియాల్సి ఉంది. ఆ వీడియోలో సుందరేశ్వరన్ మాట్లాడుతూ.. నిత్యానంద ఆయన జీవితాంతం హిందూ ధర్మం కోసం పోరాటం చేశారని చెప్పుకొచ్చారు.
నిత్యానంద తమిళనాడులోని తిరువన్నామలైలో జన్మించారు. అక్కడి నుంచి కర్ణాటకలోని బీదర్ కు మకాం మార్చారు. ఇక వరుస వివాదాల తర్వాత భారత్ నుంచి పారిపోయిన తర్వాత నిత్యానంద తానొక దేశాన్ని సృష్టించానని ప్రకటించారు. దానికి కైలాస అని పేరు పెట్టారు. నిత్యానంద 2019లో “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” అనే దేశాన్ని స్థాపించినట్లు ప్రకటించారు. అయితే ఈ దేశం ఎక్కడ ఉందనే దానిపై స్పష్టత లేదు. కొందరు ఈక్వెడార్ సమీపంలోని ఒక ద్వీపమని, మరికొందరు ఇది పూర్తిగా కల్పితమని అంటారు. ఏ దేశం గానీ, అంతర్జాతీయ సంస్థ గానీ కైలాసను గుర్తించలేదు.
అయితే 2023లో నిత్యానంద కైలాస ప్రతినిధులను ఐక్యరాజ్య సమితి సమావేశానికి పంపారు. అక్కడ వారు అతనిపై హిందూ వ్యతిరేక శక్తులు వేధిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఈ సమావేశాలు పబ్లిక్ ఈవెంట్‌లు కావడంతో ఎవరైనా హాజరు కావచ్చని, ఇది కైలాసకు అధికారిక గుర్తింపు కాదని ఐక్యరాజ్యసమితి అధికారులు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. తాజాగా ఆయన మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.