Putin Praises India: భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పంపిన సందేశం మాత్రం ఇరు దేశాల మధ్య ఉన్న చెక్కుచెదరని స్నేహబంధానికి అద్దం పడుతోంది. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక ‘ప్రత్యేకాధికారం’ (privilege)గా ఆయన ఎందుకు అభివర్ణించారు..? మన దేశ ప్రగతిపై ఆయన ఏమన్నారు? ఈ సందేశం చారిత్రక మిత్రుల మధ్య సంబంధాలను ఎలా ప్రతిబింబిస్తోంది..?
భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో తమ దేశానికి ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని, అది ఒక ‘ప్రత్యేకమైన, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం’ అని, దానిని తాము గర్వకారణంగా భావిస్తామని ఆయన తన సందేశంలో ఉద్ఘాటించారు. ఈ మేరకు భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
“భారత్ విజయాలు అమోఘం”..పుతిన్ తన సందేశంలో, స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి భారత్ సాధించిన ప్రగతిని ఎంతగానో కొనియాడారు.
“భారతదేశం సామాజిక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాలతో సహా అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధించింది. మీ దేశం ప్రపంచ వేదికపై గొప్ప గౌరవాన్ని పొందుతోంది. కీలకమైన అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో చురుకైన, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోంది.”
– వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
“భాగస్వామ్యం మాకు ప్రత్యేకాధికారం” రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఈ స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునరుద్ఘాటించారు. ఈ ప్రకటన ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆయన మరోసారి ధృవీకరించారు. “భారతదేశంతో మాకున్న ఈ ప్రత్యేక భాగస్వామ్యాన్ని మేము ఎంతో విలువైనదిగా, గర్వకారణంగా భావిస్తున్నాం. బహుళ రంగాల్లో మన నిర్మాణాత్మక సహకారాన్ని మరింత విస్తరింపజేస్తామని నేను విశ్వసిస్తున్నాను. ఈ సహకారం ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకు, ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రత, స్థిరత్వానికి ఎంతగానో దోహదపడుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.
“జై హింద్.. జై రష్యా!” : మరోవైపు, భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ కూడా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. “ప్రియమైన భారతీయ మిత్రులారా! 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో భారత స్వాతంత్ర్యం ఒక మైలురాయి. మీ అభివృద్ధి, ప్రజా సంక్షేమ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. జై హింద్. జై రష్యా” అంటూ ఆయన చేసిన పోస్ట్, రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న ఆత్మీయతను చాటింది.


