Subhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తిరిగి వచ్చే సమయం వచ్చేసింది. జూలై 14న భూమికి తిరిగి యాక్సియం-4 మిషన్‌లో భాగంగా వెళ్లిన నలుగురు వ్యోమగాములు రానున్నారు. జులై 15న కాలిఫోర్నియా తీరంలో వారు ల్యాండ్ కానున్నారు. ఆ వెంటనే వ్యోమగాములను 7 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తారట. భారత్‌కు చెందిన శుభాంశు శుక్లాతో పాటు స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్, పెగ్గీ విట్సన్ అంతరిక్షంలో గ్రావిటీ లేకుండా వాతావరణాన్ని అనుభవించిన కారణంగా ఇక్కడ ఉన్న వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ క్వారంటైన్ ఉపయోగపడనుంది.
అయితే ఈ వారం రోజుల పాటు ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇంతే కాకుండా స్పేస్ నుంచి భూమికి బయల్దేరే ముందు కూడా వ్యోమగాములకు పలు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ క్వారంటైన్‌లో ఉన్న ఏడు రోజుల్లో అంతరిక్ష యాత్ర వల్ల ఆ నలుగురు వ్యోమగాముల శరీరాలపై ఉన్న ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వారు అన్నారు. వారి శరీరంలోని రక్త ప్రవాహం, మెదడు ప్రవాహం, హృదయ నాళాలపై అంతరిక్ష యాత్ర ఎలా ప్రభావం చూపుతుందని పరిశీలిస్తారు.
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశుతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్ కపు వెళ్లారు. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి జూన్ 25న ఆకాశంలోకి దూసుకెళ్లారు. దాదాపుగా 28 గంటల ప్రయాణం చేసిన వారు ఐఎస్‌ఎస్‌కి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు ప్రయోగాలు చేశారు. ఏకంగా 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ఈ బృందం ప్రయాణించింది. ఈ నలుగురు ఇప్పటి వరకు భూమిని దాదాపు 230 సార్లు చుట్టి వచ్చారని యాక్సియం సంస్థ పేర్కొంది.