ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జీ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు దేశమంతా అట్టుడుకుతుంటే జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలు తమపని కానిచ్చేరు. జైళ్ల నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తప్పించుకునే క్రమంలో ఆర్మీ అధికారులు కాల్పులు జరిపారు.
వివరాల్లోకి వెళ్తే గురువారం ఉదయం రామెచాప్ జిల్లా జైలు నుంచి కొంతమంది ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. జైలు గేట్లను బద్దలు కొట్టి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు ప్రాణాలు కోల్పోగా..దాదాపు 12 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చి వైద్యచికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ జైలులో దాదాపు 300 మందికిపైగా ఖైదీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జైలు పూర్తిస్థాయి భద్రత కల్పించి నట్లు చెప్పిన అధికారులు..ఖైదీలందరూ తమ ఆధీనంలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయాలనే డిమాండ్‌తో మొదలైన జెన్ జీ ఉద్యమం ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, బంధుప్రీతికి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఆ ఉద్యమం ప్రభుత్వం కూలిపోయేదాకా దారితీసింది. దేశంలో పలుచోట్లా అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో పలు జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు. కాఠ్‌మాండూ, పోఖరా, లలిత్‌పుర్‌లోని జైళ్ల నుంచి దాదాపు 15,000 మందికిపైగా ఖైదీలు పారిపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు.
బాంకే జువెనైల్ రిఫార్మ్ సెంటర్ నుంచి 122 మంది, బాంకే జిల్లా జైలు నుంచి 436 మంది తప్పించుకున్నారు. కాఠ్మాండూ లోయలోని సుందరలో గల సెంట్రల్ జైలు నుంచి 3,300, లలిత్‌పుర్‌లోని నక్కు జైలు నుంచి 1,400 మంది తప్పించుకోగా.. ఢిల్లిబజార్ జైలు నుంచి 1,100 మంది పరారయ్యారు. మహోత్తర జలేశ్వర్ జైలు నుంచి 575, సున్‌సారీలోని ఝుమ్కా జైలు నుంచి 1,575, చిత్వాన్ జైలు నుంచి 700 మంది, కపిల్ వాస్తు జిల్లా జైలు నుంచి 459 మంది పారిపోయా, కైలాలి జైలు నుంచి 612 మంది, కాంచన్‌పూర్ జైలు నుంచి 478, సింధులి జైలు నుంచి 500 మంది.. తప్పించుకున్న ఖైదీలు సరిహద్దులు దాటేందుకు విఫలయత్నం చేశారు. కొందరు భారత్‌వైపు రాగా.. వారిని భారత సాయుధ పోలీసుదళం సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) అదుపులోకి తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు ఎస్‌ఎస్‌బీ అధికారులు వెల్లడించారు.
మరోవైపు నేపాల్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై జెన్ జీ ఉద్యమకారులతో ఆర్మీ అధికారులు మంతనాలు కొసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ అస్థిరతలో కూరుకుపోయిన నేపాల్‌కు తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ బాధ్యతలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


