Trump’s tariff war : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న సుంకాల సెగ భారత్‌ను తాకుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లనే సాకుగా చూపి, వాణిజ్య యుద్ధానికి తెరలేపిన ట్రంప్ తీరుపై సొంత దేశంలోనే మేధావుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో, ప్రముఖ ఆర్థికవేత్త, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ‘శత్రువు తనను తాను నాశనం చేసుకుంటున్నప్పుడు అతడి జోలికి వెళ్లవద్దు’ అన్న నెపోలియన్ మాటలను గుర్తుచేస్తూ, ట్రంప్ తనను తానే నాశనం చేసుకుంటున్నారని ఆయన అభివర్ణించారు. ఇంతకీ ట్రంప్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఎలా నష్టం కలిగిస్తాయి..? ఈ సుంకాల తుఫాను నుంచి బయటపడటానికి భారత్ ఏం చేయాలి..?
ఓపిక పట్టండి.. పేకమేడ కూలడం ఖాయం : ట్రంప్ సుంకాల విధానాలు పూర్తిగా అర్థరహితమని, అవి ఎక్కువ కాలం నిలవవని ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ కుండబద్దలు కొట్టారు. “ట్రంప్ సుంకాల పేరుతో కడుతున్నది ఇసుకలో పేకమేడ వంటిది. అది త్వరలోనే కుప్పకూలిపోతుంది. అప్పటివరకు భారత్ సంయమనం పాటించాలి” అని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొంతకాలం ఓపిక పట్టి ఎదురుచూడాలని, ట్రంప్ రెచ్చగొట్టే చర్యల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని ఆయన హితవు పలికారు.
నెపోలియన్‌ను గుర్తుచేసిన వైనం.. స్వీయ-విధ్వంసం : ట్రంప్ విధానాలను విశ్లేషిస్తూ స్టీవ్ హాంకీ ఒక చారిత్రక సామ్యాన్ని ప్రస్తావించడం గమనార్హం. “శత్రువు తనను తాను నాశనం చేసుకుంటున్నప్పుడు, అతడిని అడ్డుకోవద్దు అని నెపోలియన్ బోనపార్టే అనేవారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ ట్రంప్ కూడా అదే పనిచేస్తున్నారు. ఆయన విధానాలు చాలా చెత్తగా ఉన్నాయి. ఇది అమెరికాకే నష్టం చేకూరుస్తుంది” అని హాంకీ తీవ్రంగా విమర్శించారు. ఈ సుంకాల వల్ల అమెరికాలోనే వినియోగదారులపై భారం పడుతుందని, ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి చివరికి అమెరికా ఆర్థిక వ్యవస్థకే చేటు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌పై సుంకాల మోత.. బెదరని దిల్లీ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై ట్రంప్ తొలుత 25% సుంకాలను విధించారు. అవి అమల్లోకి వచ్చిన రోజే మరో 25% పెంచి మొత్తం భారాన్ని 50 శాతానికి చేర్చారు. భవిష్యత్తులో ఈ సుంకాలను మరింత పెంచుతామని, ఈ వివాదం తేలేవరకు న్యూఢిల్లీతో ఎటువంటి వాణిజ్య చర్చలు జరపబోమని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే, ట్రంప్ బెదిరింపులకు భారత్ ఏమాత్రం తలొగ్గలేదు. ఈ సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్, తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని, ఎవరి ఒత్తిళ్లకు తలవంచేది లేదని తేల్చి చెప్పారు.


