Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Campus Life : కొత్తగా కాలేజీకి వెళ్తున్నారా..? నవ్వుతూ కలిసిపోయే ఆ కిటుకులేంటో తెలుసుకుందామా!

Campus Life : కొత్తగా కాలేజీకి వెళ్తున్నారా..? నవ్వుతూ కలిసిపోయే ఆ కిటుకులేంటో తెలుసుకుందామా!

Making friends in college campus : కొత్త ఆశలు, మరెన్నో కలలతో కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టే ప్రతి విద్యార్థికీ అదొక కొత్త ప్రపంచం. అంతవరకు ఉన్న స్నేహితులు దూరం, పరిచయం లేని ముఖాల మధ్య కాస్త బెరుకు, ఒంటరితనం సహజమే. ఈ బెరుకును వీడి, నలుగురితో కలిసిపోయే తత్వాన్ని అలవర్చుకుంటేనే ఆ క్యాంపస్ జీవితం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. లేదంటే పదేపదే ఇంటి బెంగ తప్పదు. మరి, ఈ బిడియాన్ని పక్కనపెట్టి, నలుగురిలో నవ్వుతూ కలిసిపోయే ఆ కిటుకులేంటో తెలుసుకుందామా..?

- Advertisement -

ఇంటర్ వరకు సాగిన జీవితం ఒక ఎత్తు, ఉన్నత విద్య కోసం అడుగుపెట్టే క్యాంపస్ జీవితం మరో ఎత్తు. ఇక్కడి నుంచే వ్యక్తిగత ఎదుగుదలకు, జీవితాంతం నిలిచిపోయే స్నేహాలకు పునాది పడుతుంది. ఈ ప్రయాణాన్ని ఆనందమయం చేసుకునేందుకు నిపుణులు ఇస్తున్న సూచనలు ఇవే.

చిరునవ్వే తొలిపలకరింపు  : కొత్త వారిని చూడగానే భయపడి ముడుచుకుపోయే స్వభావాన్ని వీడండి. ఎదురుపడినప్పుడు మొహం తిప్పేసుకోకుండా, ఒక చిన్న చిరునవ్వుతో “హాయ్” చెప్పండి. ఈ చిన్న పలకరింపే కొత్త స్నేహానికి తొలిమెట్టు. వారు ఏ గ్రూపులో చేరారు, ఎక్కడి నుంచి వచ్చారు వంటి చిన్న చిన్న ప్రశ్నలతో మాటలు కలిపితే స్నేహం సులువుగా మొదలవుతుంది.

తరగతి గదే తొలి వేదిక : స్నేహానికి తరగతి గదిని మించిన వేదిక లేదు. పాఠాలు వినడమే కాకుండా, చర్చల్లో చురుగ్గా పాల్గొనండి. ఏవైనా ప్రాజెక్టులు, అసైన్‌మెంట్‌లను తోటివారితో కలిసి చేసేందుకు ఆసక్తి చూపండి. నోట్స్ పంచుకోవడం, సందేహాలు నివృత్తి చేసుకోవడం వంటివి మీ మధ్య బంధాన్ని పెంచుతాయి.

శరీర భాషే కీలకం : కొంతమందికి ఎదుటివారి కళ్లల్లోకి చూసి మాట్లాడటం అలవాటు ఉండదు. ఇది మీపై తప్పుడు అభిప్రాయం కలిగించవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా శరీర భాష చాలా ముఖ్యం. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ, ఓపెన్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. ధైర్యంగా కళ్లలోకి చూసి మాట్లాడటం అలవాటు చేసుకోండి.

క్యాంటీన్‌లో కబుర్లు : ఒంటరిగా కూర్చోకుండా క్యాంటీన్, కామన్ ఏరియాల్లో నలుగురితో కలిసి కూర్చోండి. సినిమాలు, క్రీడలు వంటి అంశాలపై చర్చ మొదలుపెట్టండి. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ, మీ అభిరుచులను పంచుకోండి. ఇలాంటి సాధారణ కబుర్లే బలమైన స్నేహాలకు దారితీస్తాయి.

బృంద కార్యకలాపాల్లో భాగమవ్వండి : పెద్ద సమూహాల్లో కలవడం ఇబ్బందిగా అనిపిస్తే, నలుగురైదుగురు ఉన్న చిన్న గ్రూపుల్లో చేరండి. కలిసి టీ తాగడం, లైబ్రరీకి వెళ్లడం, క్యాంపస్ ఫెస్ట్‌లలో పాల్గొనడం వంటివి చేయండి. ఇది మీలోని బిడియాన్ని పోగొడుతుంది.

ఫోన్‌కు అతుక్కుపోవద్దు : క్యాంపస్‌కు సంబంధించిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూపుల్లో చేరడం మంచిదే. కానీ, ఎప్పుడూ ఫోన్‌కే అతుక్కుపోయి, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని మీ లోకంలో మీరుంటే మరింత ఒంటరైపోతారు. వాస్తవ ప్రపంచంలో స్నేహితులను సంపాదించుకోవడంపై దృష్టి పెట్టండి.

మీలోని కళకు పదును పెట్టండి : మీకు డ్యాన్స్, సంగీతం, నటన వంటి కళల్లో ప్రవేశం ఉంటే, వాటిని ప్రదర్శించడానికి వెనుకాడొద్దు. క్యాంపస్‌లో జరిగే కల్చరల్ ఈవెంట్లు, డ్రామా క్లబ్‌లలో చేరండి. మీ అభిరుచులకు తగిన స్నేహితులు మీకు సులభంగా పరిచయమవుతారు.

స్నేహానికి కాస్త సమయమివ్వండి : ఇక్కడ మీరొక్కరే కాదు, అవతలి వారూ కొత్తవారేనని గుర్తుంచుకోండి. అందరూ వెంటనే కలిసిపోతారని ఆశించవద్దు. కొందరితో స్నేహం ఏర్పడటానికి సమయం పట్టొచ్చు. కాబట్టి కొత్త స్నేహాల విషయంలో కాస్త ఓపిక, సహనం చాలా అవసరం. సానుకూల దృక్పథంతో ఈ చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే, మీ క్యాంపస్ జీవితం జీవితాంతం గుర్తుంచుకునే మధుర జ్ఞాపకాల పందిరి అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad