మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. గోండియా జిల్లాలోని కొహ్మారా స్టేట్ హైవేపై బైకును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా… పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే… మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కి చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో 35 మంది ప్రయాణికులతో నాగపూర్ నుంచి గోండియా కి వెళ్తోంది. ఖజ్రీ గ్రామ సమీపంలోకి రాగానే అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించిపోయి అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ బస్సు ప్రమాదం (Bus Accident) లో 9 మంది ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు గాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు.