Billionaire Selling Meat: జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ప్రతీఒక్కరికి ఎదురవుతూనే ఉంటాయి. కొందరు వాటిని ఎదుర్కొని మిగిలిన వారికి ఆదర్శంగా నిలిస్తే.. మరికొందరు డీలాపడిపోయి ఆత్మహత్యలుసైత చేసుకుంటున్న సందర్భాలున్నాయి. చైనాకు చెందిన ఓ బిలియనీర్ 35ఏళ్ల వయస్సుకే విజయవంతమైన వ్యాపారవేత్తగా మారాడు. కానీ అతను చేసిన చిన్నతప్పు వల్ల మళ్లీ రోడ్డుపైకొచ్చాడు. అయినా అతను అధైర్యపడలేదు. నా ఆలోచనే నా పెట్టుబడి, నాణ్యతే నా వ్యాపార అభివృద్ధి అనుకొని రోడ్డుపైకొచ్చి మటన్ దుకాణం పెట్టుకున్నాడు. మీకు ఎలాంటి పిండి పదార్థాలు కలపకుండా స్వచ్ఛమైన మాంసాన్ని అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇతని గత పరిస్థితిని తెలుసుకున్న కొందరు సోషల్ మీడియాలో వివరిస్తూ, ఫొటోలతో పోస్టు చేశారు. దీంతో వీడు మొగాడ్రా బుజ్జీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చైనాకు చెందిన తాంగ్ జియన్ (52) విజయవంతమైన వ్యాపారవేత్త. రెస్టారెంట్ల వ్యాపారంలో 36ఏళ్లలో కోట్లు సంపాదించాడు. ఈ క్రమంలో 2005లో ల్యాండ్ స్కేప్ ఇంజనీరింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టి భారీ నష్టాలు చవిచూశాడు. దీంతో అతని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. రెస్టారెంట్లు, కార్లు, ఇళ్లు అన్ని అమ్ముకోగా మరో రూ. 52 కోట్లు అప్పుగా మిగిలింది. అయినా అతను అధైర్య పడేదు. ఆ అప్పు తీర్చేందుకు మాసంతో తయారు చేసే ఆహారపదార్థాల విక్రయం మొదలుపెట్టాడు. హాంగ్ ఝౌలోని ఓ వీధిలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను అమ్మే మాంసాహారంలో ఎలాంటి పిండి ఉండదు. నాణ్యమైన మాంసం విక్రయిస్తానంటూ ప్రజలకు ప్రచారం చేసి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు.
తనకు ఎదురైన జీవిత అనుభవంపై తాంగ్ జియన్ స్పందిస్తూ.. జీవితంలో కష్టనష్టాలు ఎవరికైనా ఎదురవుతాయి. కానీ, వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే మనం విజయం సాధించినట్లు అని చెప్పాడు. తాంగ్ జియన్ స్ఫూర్తినిచ్చే స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతీఒక్కరూ తాంగ్ జియన్ ప్రయత్నాన్ని ప్రసంశిస్తున్నారు.