Sunday, July 7, 2024
Homeనేషనల్A leader took 2 months leave: 2 నెలలు సెలవు తీసుకున్న లీడర్!

A leader took 2 months leave: 2 నెలలు సెలవు తీసుకున్న లీడర్!

పార్టీపై అలిగి లీవ్ తీసుకున్న ఫైర్ బ్రాండ్

సినిమాల్లో, రాజకీయాల్లో లీవులుంటాయా? ఒకవేళ ఏదైనా అవసరమై లీవు పెట్టినా, కెరీర్ లో బ్రేక్ తీసుకున్నా ఇక తమ కెరీర్ లో వాళ్లు వెనకబడిపోయినట్టే. కానీ రెబెల్ లీడర్ గా బ్రాండ్ పడ్డ మరాఠా లీడర్ పంకజా ముండే కథే వేరు. అందుకే ఆమె తన పొలిటికల్ కెరీర్ లో 2 నెలల బ్రేక్ తీసుకుంటానని చాలా సాహసోపేతమైన నిర్ణయం ప్రకటించారు. రెండు నెలల లీవ్ తర్వాత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతానని ఆమె చెప్పటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

అలుపు-విరామం ఎరుగని వృత్తి రాజకీయాలు. అలాంటి రాజకీయాల్లో ఎవరూ సాధారణంగా సెలవులు పెట్టే సాహసం చేయరు. కొందరు నేతలైతే విదేశాలకు వెళ్లేందుకు కూడా భయపడిపోతారు, తమ స్థానం ఎవరు కొట్టేస్తారోనని వీళ్ల భయం. అందులే లీడర్స్ ఎవరూ ఎక్కువ కాలం విదేశాల్లో ఉండరు. అలాంటిది గోపీనాథ్ ముండే కుమార్తె, బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఇలా లీవ్ తీసుకోవటం బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది.

ఒకవైపు సొంత పార్టీలో పొసగలేకపోతున్న ఈమె ఇంకో పార్టీలో చేరలేక గత కొన్నేళ్లుగా నలిగిపోతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ సంకీర్ణమే రాజ్యమేలుతున్నా ఈమెకు మాత్రం ఎటువంటి ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత దక్కట్లేదు. భీడ్ ప్రాంతంలో అత్యంత పలుకబడి ఉన్న ముండే కుటుంబ వారసురాలైనా కమలం మాత్రం ఆమెను గుర్తించడం లేదు. ఆమెవన్నీ ఒంటెత్తు పోకడలని పార్టీ భావన. అందుకే మొదటి నుంచీ ఫడ్నవిస్ వంటి వారు ఆమెను దూరంగానే పెడుతున్నారు. వీటిని చూసి సహించలేని పంకజా ముండే తిరుగుబాట పట్టడంతో ఆమె కెరీర్ ఏదో అలా సాగుతోంది. బీజేపీని వీడనని, అలాగని వెన్నుపోటు పొడిచే రక్తం తనది కాదని కుండబద్ధలు కొట్టిన ఈ లేడీ ఫైర్ బ్రాండ్ తాజాగా అలక వహించటాన్ని బీజేపీ అస్సలు కేర్ చేయట్లేదు.

పంకజా ముండే వాదనల్లా ఒకటే..దశాబ్దాల తరబడి కాంగ్రెస్,ఎన్సీపీపై పోరాడిన తాము ఇవే పార్టీలతో కలిసి పనిచేయమంటే మా పోరాటానికి అర్థమేముంది, మేమెలా కలిసి పనిచేయగలం అని ప్రశ్నించటమే పంకజా చేసిన తప్పు. పైన లీడర్లంతా బాగుంటారు, పార్టీలకు, జెండాలకతీతంగా వీరు కలిసిపోతుంటారు, ఆతరువాత ఆరోపణలు చేసుకుంటుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అనుచరులు, నేతలు మాత్రం ఇవి రాజకీయ కక్షలుగా, కుటుంబ రాజకీయాలుగా తరతరాలుగా వాటిని అలా కొనసాగిస్తుంటారు. మరి ఇలా పరస్పర విరుద్ధ భావజాలాలున్న పార్టీలు చేతులు కలిపి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేస్తే తమలాంటి వాళ్ల పరిస్థితి ఏం కావాలని ఇప్పుడు పంకజా ముండే అనుచరులు సంధిస్తున్న కీలక ప్రశ్న. వీటికి జవాబు చెప్పే అవసరం, తీరిక బీజేపీలోని ఏ స్థాయి వారికి లేకపోవటం విశేషం.

కాగా ఆమె సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయినట్టు వార్తలు వస్తుండగా, తాను గాంధీ కుటుంబీకులను ఎవరినీ కలవ లేదని ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అంతేకాదు, తన రాజకీయ భవిష్యత్తును అంతమొందించే కుట్రలో భాగంగంగానే ఇదంతా సాగుతోందని వాపోయారు. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మాత్రం ఓ అడుగు ముందుకేసి ఆమెను కాంగ్రెస్ లో చేరాల్సిందిగా బహిరంగంగా ఆహ్వానించటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News