Monday, November 17, 2025
Homeనేషనల్Amit Shah : అరుదైన రికార్డు.. హోం మంత్రిగా అద్వానీని అధిగమించిన అమిత్ షా !

Amit Shah : అరుదైన రికార్డు.. హోం మంత్రిగా అద్వానీని అధిగమించిన అమిత్ షా !

Amit Shah’s political milestone :  భారత రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశంలో అత్యధిక కాలం హోం మంత్రిగా పనిచేసిన నేతగా ఆయన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న రికార్డును అమిత్ షా అధిగమించారు. ఇంతకీ అమిత్ షా ఎన్ని రోజులు హోం మంత్రిగా ఉన్నారు..? ఈ రికార్డు వెనుక ఉన్న రాజకీయ ప్రాధాన్యత ఏమిటి..?

- Advertisement -

రికార్డుల పరంపర: భారత రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేస్తున్న అమిత్ షా, కేంద్ర హోంమంత్రిగా 6 సంవత్సరాల 65 రోజులు పూర్తి చేసుకుని, ఆగస్టు 5, 2025 నాటికి ఈ ఘనత సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు 6 సంవత్సరాల 64 రోజుల పాటు హోంమంత్రిగా పనిచేసిన ఎల్.కె. అద్వానీ పేరిట ఉండేది. 2019 మే 31న నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రివర్గంలో అమిత్ షా తొలిసారిగా కేంద్ర హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. 2024లో మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక కూడా, హోం శాఖ బాధ్యతలను తిరిగి అమిత్ షాకే అప్పగించారు, ఇది ఆయనపై ప్రధానికి ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనం.

మోదీ-షా జోడి: రాజకీయాల్లో తిరుగులేని శక్తి : ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల జోడి భారత రాజకీయాల్లో “చాణక్య-చంద్రగుప్త” ద్వయంగా పేరుగాంచింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పటి నుంచి అమిత్ షా ఆయనకు నమ్మినబంటుగా, కీలక వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాల వెనుక అమిత్ షా వ్యూహచతురత కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు.పార్టీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరింపజేయడంలో ఆయన చేసిన కృషి అమోఘం.

ప్రధాని మోదీ సైతం రికార్డుల బాటలో: ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత, దేశానికి ఎక్కువకాలం సేవలందించిన రెండో ప్రధానమంత్రిగా ఆయన ఇందిరా గాంధీని అధిగమించారు. జూలై 25, 2025 నాటికి ప్రధానిగా 4,078 రోజులు పూర్తి చేసుకుని మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజుల పాటు ప్రధానిగా పనిచేసి ప్రథమ స్థానంలో ఉన్నారు.

అమిత్ షా హయాంలో కీలక నిర్ణయాలు: హోంమంత్రిగా అమిత్ షా పదవీకాలంలో దేశ భద్రతకు సంబంధించి అనేక చారిత్రాత్మక, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో అత్యంత కీలకమైనది జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు. 2019 ఆగస్టు 5న ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించి, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) తీసుకురావడం, నూతన క్రిమినల్ చట్టాలను ప్రవేశపెట్టడం వంటివి ఆయన హయాంలో తీసుకున్న మరికొన్ని ముఖ్యమైన సంస్కరణలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad