Amit Shah On Pahalgam Attack And POK: పహల్గామ్ యాత్రికులపై జరిగిన పాశవిక దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకుని తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో గర్జించారు. పహల్గామ్ దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని తేల్చి చెప్పిన ఆయన, ‘ఆపరేషన్ మహాదేవ్’తో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని ప్రకటించారు.
అమరనాథ యాత్రికులే లక్ష్యంగా దాడి
ఇటీవల అమరనాథ యాత్రకు వెళ్తున్న భక్తులపై పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా, మతం అడిగి మరీ దారుణంగా హతమార్చిన ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా, ఈ దాడి లష్కరే తోయిబా పనేనని స్పష్టం చేశారు. ప్రజల ఆగ్రహానికి అనుగుణంగానే, ఆ ముగ్గురు ఉగ్రవాదులను మన సైన్యం తలలపైనే గురిపెట్టి కాల్చి చంపిందని ఆయన వెల్లడించారు. ఇంతటి అమానవీయ ఘటన మునుపెన్నడూ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆపరేషన్ మహాదేవ్’ – ఉగ్రవేట ఇలా
పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ మహాదేవ్’ చేపట్టారు. అత్యంత కఠినమైన భూభాగంలో, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ, డ్రోన్ల ద్వారా సరఫరా చేసిన ఆహారం తింటూ మన బలగాలు ఉగ్రవాదులను వెంటాడాయి. వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ, పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ‘శివాజీ మహారాజ్ మొఘలులపై పోరాడినప్పుడు ‘హరహర మహాదేవ్’ అని నినదించారు. అలాగే మన సైన్యానికి చెందిన వివిధ రెజిమెంట్లు వారి మత విశ్వాసాల ఆధారంగా యుద్ధ నినాదాలు చేస్తాయి. దీనికి హిందూ, ముస్లింలతో సంబంధం లేదు’ అని ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుపై కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన విమర్శలను అమిత్ షా తిప్పికొట్టారు.
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప, దేశ భద్రత పట్టదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలోనే పీవోకే పాకిస్థాన్ వశమైందని, కానీ బీజేపీ ప్రభుత్వం దానిని తిరిగి భారత్‌లో విలీనం చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని, తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి ఉంటే, ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే బదులు, వారికి లేఖలు రాసేవారని ఆయన ఎద్దేవా చేశారు.
చిదంబరంపై ఫైర్
పహల్గామ్ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని నిరూపించాలని, తన రాజీనామాను డిమాండ్ చేసిన మాజీ హోంమంత్రి చిదంబరంపై అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ మనస్తత్వాన్ని చిదంబరం ప్రపంచానికి బహిర్గతం చేశారని, ఓటు బ్యాంకు కోసం వారు పాకిస్థాన్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు కూడా మద్దతు ఇస్తారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/dgca-audit-indian-airlines-safety-lapses/
వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు
అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు సభలో నిరసన తెలిపాయి. సభాధ్యక్షుడు వారి డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో, వారు సభ నుంచి వాకౌట్ చేశారు.
హిందువులు ఉగ్రవాదులు కాలేరు
భారత్‌లో ఉగ్రవాదం చివరి దశలో ఉందని, త్వరలోనే దానిని పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘హిందువులు ఎప్పటికీ ఉగ్రవాదులు కాలేరు, ఈ విషయాన్ని ప్రపంచానికి గర్వంగా ప్రకటిస్తున్నాను’ అని ఆయన అన్నారు.


