Monday, November 17, 2025
Homeనేషనల్Shubhanshu Shukla: గగన యానం నుంచి ఘన స్వాగతం.. ప్రధాని మోదీతో వ్యోమగామి శుభాంశు భేటీ!

Shubhanshu Shukla: గగన యానం నుంచి ఘన స్వాగతం.. ప్రధాని మోదీతో వ్యోమగామి శుభాంశు భేటీ!

Shubhanshu Shukla Return To India: అంతరిక్షంలో 18 రోజుల చారిత్రక యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని, యావత్ భారతావని గర్వపడేలా చేసిన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఏడాది కాలంగా కుటుంబానికి, స్నేహితులకు దూరంగా కఠోర శిక్షణ పొంది, సుదూర రోదసిలో పరిశోధనలు జరిపిన ఆ గగన వీరుడికి ఘన స్వాగతం పలికేందుకు దేశం సిద్ధమవుతోంది. వచ్చిన వెంటనే ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతరిక్షంలో ఆయన చూసిన అద్భుతాలేంటి? ప్రధానితో ఏం చర్చించబోతున్నారు..? భారత అంతరిక్ష యాత్రకు ఆయన అనుభవాలు ఏ విధంగా దోహదపడనున్నాయి..?

- Advertisement -

మాతృభూమికి పయనం.. భావోద్వేగ క్షణాలు : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి జులై 15న భూమికి తిరిగి వచ్చిన శుభాంశు, అనంతరం తప్పనిసరి క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆదివారం భారత్‌కు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. “ఏడాదికి పైగా కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉన్నాను. తిరిగి భారతదేశానికి వస్తున్న విమానంలో కూర్చున్నప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను” అంటూ విమానంలో కూర్చున్న ఫొటోను పంచుకున్నారు. స్వదేశానికి చేరుకున్నాక తన అనుభవాలను అందరితో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత్‌కు చేరుకున్న వెంటనే శుభాంశు శుక్లా :  ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం ఆయన తన స్వస్థలమైన లఖ్‌నవూకు వెళ్లనున్నారు. ఆగస్టు 22-23 తేదీల్లో జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొని, తన అంతరిక్ష యాత్ర విశేషాలను పంచుకోనున్నారు.

ALSO READ: https://teluguprabha.net/national-news/supreme-court-recounts-panchayat-votes-haryana-sarpanch/

అమెరికాలో శిక్షణ.. అంతరిక్షంలో ప్రయోగాలు : భారత వాయుసేనలో గ్రూప్ కెప్టెన్‌గా పనిచేస్తున్న శుభాంశు శుక్లా, యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ యాత్ర కోసం ఆయన దాదాపు సంవత్సరం పాటు అమెరికాలో ఉండి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఈ బృందంలో ఆయనతో పాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ (పోలాండ్), టిబోర్ కపు (హంగేరీ) ఉన్నారు. రోదసిలో 18 రోజుల పాటు గడిపిన ఈ బృందం, మానవాళికి ప్రయోజనం కలిగించే పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది.

ఎర్రకోట సాక్షిగా ప్రధాని ప్రశంస : ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో శుభాంశు శుక్లాను ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. “భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. మన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర నుంచి తిరిగి వచ్చారు. త్వరలోనే ఆయన భారత్‌కు కూడా రానున్నారు” అని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఇది భారత అంతరిక్ష కార్యక్రమానికి, వ్యోమగాములకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. కాగా, 2027లో ఇస్రో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో శుభాంశు శుక్లా కీలక పాత్ర పోషించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad