Sunday, October 20, 2024
Homeనేషనల్Maharashtra Elections: 99 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల

Maharashtra Elections: 99 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల

Maharashtra Elections| మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండంటంతో బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాలను విడుదల చేసింది. 288 స్థానాలకు గాను 99 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా ఉంది. ఆయన నాగ్‌పుర్ సౌత్ వెస్ట్ స్థానం పోటీ చేయనున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే కామఠీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. అలాగే భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం శ్రీజయ చవాన్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాగా మొత్తం 288 సీట్లలో బీజేపీ 151లో పోటీ చేస్తోండగా.. మిగిలిన సీట్లను షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు పంచుకుంటాయి.

- Advertisement -

మహాయుతి వర్సెస్ మహావికాస్..

కాగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానం రెండు కూటముల మధ్య పోరు నెలకొంది. అధికార బీజేపీ నేతృత్వంలో ‘‘మహాయుతి’’ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ’’ కూటమి మధ్య తీవ్ర పోటీ ఉంది. మహాయుతిలో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీలు ఉండగా.. మహావికాస్ కూటమిలో కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే శివసేన- శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహావికాస్ కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వచ్చింది. త్వరలోనే ఈ కూటమి పార్టీలు కూడా వరుసగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నాయి.

నవంబర్ 20న పోలింగ్.. 23న ఫలితాలు..

రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా 2019లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2021లో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దీంతో షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొన్ని నెలల అనంతరం ఎన్సీపీ నుంచి కూడా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దీంతో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలు తాడేపేడో రీతిలో జరగనున్నాయి. మరి ప్రజలు ఏ కూటమి పట్టం కడతారో తెలియాలంటే నవంబర్ 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News