India’s national security challenges : మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, భారతదేశం ఎదుర్కొంటున్న జాతీయ భద్రతా సవాళ్లపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదమే మన దేశానికి అతిపెద్ద సవాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి సైబర్ యుద్ధాల వరకు, భారత్ ముందున్న ఆరు ప్రధాన సవాళ్లను ఆయన విశ్లేషించారు. ఇంతకీ, ఆయన చెప్పిన ఆ ఆరు సవాళ్లేంటి..?
ఆరు సవాళ్లు.. అప్రమత్తంగా ఉండాలి : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ చౌహాన్, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పులను ఏకరువు పెట్టారు.
చైనా సరిహద్దు వివాదం: డ్రాగన్‌తో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సరిహద్దు వివాదమే మనకు నంబర్ వన్ సవాలని ఆయన అభివర్ణించారు.
పాకిస్థాన్ ప్రాక్సీ యుద్ధం: పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో ‘వెయ్యి గాయాలు చేసి భారత్‌ను బలహీనపరచాలనే’ (Bleed India with a thousand cuts) దాయాది దేశపు కుటిల వ్యూహం రెండో అతిపెద్ద సవాలని పేర్కొన్నారు.
ప్రాంతీయ అస్థిరత: మన పొరుగు దేశాల్లో నెలకొన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక అశాంతి కూడా మన భద్రతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
మారిన యుద్ధ క్షేత్రాలు: భవిష్యత్ యుద్ధాలు కేవలం భూమి, గాలి, నీటికే పరిమితం కావని, సైబర్, అంతరిక్ష, విద్యుదయస్కాంత రంగాల్లోకి విస్తరించాయని, దీనికి తగ్గట్టుగా మనం సిద్ధం కావడం నాలుగో సవాలని అన్నారు.
అణ్వస్త్ర దేశాలతో వ్యూహం: ఇరువైపులా అణ్వాయుధాలున్న శత్రుదేశాలపై ఎలాంటి సైనిక చర్యలు చేపట్టాలనేది నిర్ణయించుకోవడం ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్నదని, ఇది ఐదో సవాలని తెలిపారు.
సాంకేతికత ప్రభావం: భవిష్యత్ యుద్ధాలపై సాంకేతికత ప్రభావం ఆరో సవాలని పేర్కొన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ అసలు లక్ష్యం అదే : ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’పై సీడీఎస్ కీలక విషయాలు వెల్లడించారు. “ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కేవలం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడం కాదు. భారత దేశం యొక్క సహనానికి ఒక ఎర్ర గీత (Red Line) గీయడం,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో త్రివిధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఇచ్చారని, జాతీయ భద్రతా సలహాదారు (NSA) మార్గదర్శకత్వంలో, దౌత్యపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని అత్యంత సమన్వయంతో దీనిని విజయవంతం చేశామని తెలిపారు.
ఈ ఆపరేషన్, త్రివిధ దళాల మధ్య సమన్వయం, బహుళ-డొమైన్ ఆపరేషన్లకు ఒక నిదర్శనంగా నిలిచిందని జనరల్ చౌహాన్ కొనియాడారు. వైమానిక రక్షణ వ్యవస్థల నుంచి డ్రోన్ల వరకు అన్ని విభాగాలూ సమష్టిగా పనిచేసి బలాన్ని ప్రదర్శించాయని అన్నారు.


