అయోధ్య(Ayodhya) రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్(Satyendra Das) కన్నుమూశారు. కొంతకాలంగా బీపీ, షుగర్‌తో బాధపడుతున్న ఆయనకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సత్యేంద్ర మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ‘‘శ్రీరాముని పరమ భక్తుడు, శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య శ్రీ సత్యేంద్ర కుమార్ దాస్ మరణం చాలా విచారకరం, ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని నష్టం’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
కాగా 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. కూల్చివేతకు ముందు సీతారామ విగ్రహాలను సమీపంలోని ఫకీరే మందిరానికి తరలించారు. రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.