Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 68 స్థానాలకు నవంబర్ 12న ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 35 మంది సభ్యుల సంఖ్యా బలం అవసరం. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ 34, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశపడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిని మొదలుపెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎమ్మెల్యేలను తరలించాలనే యోచనలో ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను గురువారం సాయంత్రానికి రాజస్థాన్‌కు బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఈ బాధ్యతలను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలకు అప్పగించినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని పరిస్థితులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మద్యాహ్నం ఆమె సిమ్లాకు చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.