Vice President: భారత 17వ ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. బలమైన సంఘ్ నేపథ్యమున్న రాధాకృష్ణన్ కమలం పార్టీలో కీలక నేతగా మారారు. కాషాయ పార్టీ ప్రభావం లేని రాష్ట్రాల్లోనూ విజయాలు సాధించిన చరిత్ర ఆయనది. పార్టీక అత్యంత విధేయుడిగా ఆయనకు పేరుంది. ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ ఆయన్ను ఎంచుకొంది. ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ను బరిలో నిలిపి గెలిపించింది. కాగా.. ఆయన నేపథ్యం గురించి తెలుసుకోండి.
బాల్యం
తమిళనాడులోని తిరుప్పుర్‌లో సి.కె.పొన్నుస్వామి-జానకి దంపతులకు 1957 అక్టోబర్ 20న రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన కాలేజీ సమయంలో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు. రాధాకృష్ణన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కూడా. ఆయన 16 ఏళ్ల వయసులో తొలిసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS), భారతీయ జన సంఘ్ సంస్థలతో కలిసి పనిచేశారు. ఆయన 1974లో సంఘ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీ ఆవిర్భవించడంతో అందులో చేరారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు కోయంబత్తూర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేసి 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. డీఎంకే నేత రామనాథన్‌ను నాడు ఓడించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి గెలిచిన ముగ్గురు కాషాయ పార్టీ ఎంపీల్లో రాధాకృష్ణన్ కూడా ఒకరు. రాజకీయ మార్పుల కారణంగా 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన 55,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండు సార్లు అటల్ బిహారీ వాజ్‌పేయీ సర్కారులో కేంద్ర మంత్రి అవకాశం త్రుటిలో చేజారింది. అయినప్పటికీ అప్పటి ప్రధానికి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.
Read Also: Bigg Boss: తొలివారం నామినేషన్స్ షురూ.. సామాన్యుల టార్గెట్ సంజనానే..!
యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్ లో..
ఐక్యరాజ్యసమితి 58 సెషన్‌లో పాల్గొన్న పార్లమెంటరీ బృందంలో ఆయన సభ్యుడు. 2003 అక్టోబరులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మానవీయ, విపత్తు సహా సమన్వయంపై నాడు మాట్లాడారు. 2004 తర్వాత నుంచి ఆయన తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించలేదు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర చీఫ్ గా 2004, 2007లో బాధ్యతలు నిర్వహించారు. రాధాకృష్ణన్ సేవలను గుర్తించిన మోదీ సర్కారు 2023లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమించింది. దాదాపు ఏడాదిన్నర అక్కడ పనిచేసిన తర్వాత గతేడాది మార్చిలో తమిళసై సౌందర రాజన్ రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కానీ, జులైలో ఆయన్ను మహారాష్ట్రకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించారు. మిగిలిన రాష్ట్రాల బాధ్యతలను ఇతరులకు అప్పగించారు.
Read Also: Bigg Boss: తొలివారం నామినేషన్స్‌లో 9 మంది.. సామాన్యుల నుంచి పడాల, భరణి సేఫ్..!
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో..
ఆరోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ సడెన్ గా రాజీనామా చేశారు. జగదీప్ రాజీనామా చేయడం అధికార ఎన్డీయేను ఇబ్బందికి గురి చేసింది. ఆయన వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన రాధాకృష్ణన్‌ను ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేశారు. ఎన్డీయే పక్షాల మద్దతుతో ఆయన సునాయాసంగా గెలుపొందారు.


