Delhi High Court Orders Retrial in Anti-Sikh Riots Case: దేశవ్యాప్తంగా కలకలం రేపిన 1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 1986లో ట్రయల్ కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన మూడు కేసుల రికార్డులను పునర్నిర్మించి, వాటిని తిరిగి విచారించాలని కోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులు 1984 నవంబర్‌లో ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రాజ్‌నగర్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు సంబంధించినవి.
జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ తో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయని, ట్రయల్ కోర్టు తీర్పు కూడా సరిగా లేదని పేర్కొంది. మొత్తం ఐదు కేసులలో మూడు కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టు తీర్పులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం కారణంగా అనేకమంది సాక్షులను విచారించలేదని, దీని వల్ల బాధితులకు, సమాజానికి న్యాయం జరగకుండా పోయిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
కేసుకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల కేసును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అందుకే రికార్డులను పునర్నిర్మించాలని, సీబీఐ, సుప్రీంకోర్టు, లేదా గతంలో నియమించిన కమిషన్ల వద్ద ఈ కేసులకు సంబంధించిన సమాచారం ఉండవచ్చని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. 1984 నాటి దారుణాలకు సంబంధించిన కేసులో హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం బాధితులకు ఆశలు కల్పిస్తోంది.


