వీధులన్నీ గలీజు చేస్తూ, ఎవరిపై పడితే వారిపై దాడులు చేసేస్తున్న పెంపుడు కుక్కలను కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్ లో కఠిన చట్టాలు అమలుకాబోతున్నాయి. పెంపుడు కుక్కలపై ట్యాక్స్ వసూలు చేసేందుకు మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్సిపల్ కమిషనర్ రెడీ అయ్యారు. వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకే ఈ కొత్త పన్ను అంటూ సాగర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ శుక్లా వివరణ ఇస్తుండటం కుక్కలు పెంచుకుంటున్న యజమానుల ఆగ్రహానికి కారణం అవుతోంది.
సాగర్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అందరూ ఇందుకు ఏకగ్రీవంగా అంగీకరించటం విశేషం. భద్రత, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకుంటే కుక్కల జోరుకు కళ్లెం వేయాల్సిందేనని వీరు భావిస్తున్నారు. ఈ విషయంపై న్యాయ నిపుణుల సలహాను సైతం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ట్యాక్స్ అమల్లోకి రానుంది. కాగా తాము కూడా సెక్యూరిటీ కోసమే కుక్కలను పెంచుకుంటున్నట్టు, పైగా వాటికి టీకాలు కూడా వేపిస్తున్నామని కుక్కల ప్రేమికులు, యజమానులు గట్టిగా వాదిస్తున్నారు.