భారతదేశంలో కట్నం నిషేధ చట్టం అమల్లో ఉన్నా, కట్న వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లి సమయంలో కట్నం ఇచ్చినా, భర్త కుటుంబం అదనపు కట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా, కొన్నిసార్లు హత్యలు, ఆత్మహత్యలకు కూడా దారి తీస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. వివాహ సమయంలో కట్నం ఇచ్చినా.. అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు. తాము అడిగినంత అదనపు కట్నం ఇవ్వలేదనే కోపంతో అత్తమామలు కలిసి కోడలికి హెచ్‌ఐవి ఇంజక్షన్ ఇచ్చారు.
2023 ఫిబ్రవరి 15వ తేదీన ఓ యువతికి.. ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు చెందిన అభిషేక్‌తో వివాహం అయింది. అప్పుడు కట్నంగా రూ.15 లక్షలు వధువు కుటుంబ సభ్యులు ఇచ్చారు. అయితే వివాహం అయిన కొన్ని రోజులకే కోడలికి వేధింపులు మొదలయ్యాయి. స్కార్పియో వాహనం కొనుగోలు చేసేందుకు మరో రూ.25 లక్షలు కట్నంగా తేవాలని కోడలిని వేధించడం మొదలుపెట్టారు అత్తమామలు. ఈ క్రమంలో కోడలు ఎన్నో చిత్రహింసలు పెట్టారు.
అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామంటూ.. ఆ యువతిని ఇంటి నుంచి గెంటేశారు. ఈ క్రమంలో ఊరి పెద్దలు కలగజేసుకోవడంతో తిరిగి ఆమెను ఇంట్లోకి రానిచ్చారు. అయితే కట్నం కోసం ఆ యువతిని శారీరకంగా, మానసికంగా వేధించడం మాత్రం ఆపలేదు. ఎంతకీ ఆమె డబ్బు తీసుకురాకపోవడంతో హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. దీనిలో భాగంగానే ఆమెకు హెచ్ఐవి వైరస్‌తో కూడిన ఇంజక్షన్ చేశారు. దీంతో ఆమె అనారోగ్యానికి గురయ్యింది. వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లగా.. HIV ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఆమె భర్తకు నిర్వహించిన పరీక్షల్లో మాత్రం నెగెటివ్ అని వచ్చింది.
దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోవడంతో కోర్టుకు వెళ్లారు. ఈ ఘటనపై కోర్టు వెంటనే స్పందించి.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం భర్త అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.