ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను ECI విడుదల చేసింది. ఒకే దశలో.. పోలింగ్ నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. జనవరి 10 నోటిఫికేషన్ జారీ చేస్తామని.. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 17 అని పేర్కొన్నారు. ఇక జనవరి 18న స్క్రూటినీ జరుగుతుందని వివరించారు. ఫిబ్రవరి 5 ఓటింగ్, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడిస్తామని ఆయన వివరించారు.
ఇక ఈ సందర్భంగా తనకిదే చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ అని.. CEC రాజీవ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఒక ఎలక్షన్ సైకిల్ పూర్తిచేసుకున్నానని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఆఖరి గంటలో పోలింగ్ పెరగడం, ఓటింగ్ యంత్రాలపై కొన్ని పార్టీలు నిందలపై షయరీలతో సెటైర్లు వేశారు. ఇక EVMలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని CEC రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల్లోకి ట్రోజన్ హార్స్, బగ్స్ ను పంపించలేరని తెలిపారు. ఇది తాను చెప్తున్నది కాదని.. EVMలు హ్యాక్ ప్రూఫ్ అంటూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు.
ఇదిలా ఉంటే ఈసారి హస్తిన అసెంబ్లీ పోరు హోరాహోరీగా సాగుతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ కొనసాగుతోంది. గత రెండు పర్యాయాలు అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు దేశాన్ని ఏలుతున్న ఢిల్లీలోనూ పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా తమ సత్తా చాటాలని భావిస్తోంది. దీంతో త్రిముఖ పోరు కనపడుతోంది.
కాగా ప్రస్తుత అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా. కాంగ్రెస్, బీజేపీ కొన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు.