Integrated Farming Success : ఒకప్పుడు 31 గుంటల భూమితో, అరకొర ఆదాయంతో బతుకు బండిని లాగడమే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే రైతు ఏటా రూ.20 కోట్ల టర్నోవర్‌తో ఓ చిన్నపాటి వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించారు. ఆయన పండించిన పంటలు దేశ సరిహద్దులు దాటి పొరుగు దేశానికి సైతం ఎగుమతి అవుతున్నాయి. వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆయనే ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆదర్శ రైతు దశరథ్ సావ్. ఓ సన్నకారు రైతు ఈ స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన విజయ రహస్యం ఏంటి…? జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ఆలోచన ఏది..? తెలుసుకుందాం పదండి.
అత్తవారింటికి వెళ్తే.. తట్టిన ఆలోచన : ఝార్ఖండ్‌లోని ఛత్రా జిల్లా, లామ్టా గ్రామానికి చెందిన దశరథ్ సావ్ పదో తరగతి వరకు చదువుకున్నారు. తనకున్న 31 గుంటల భూమిలో సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఒకసారి తన భార్య మీనాదేవితో కలిసి అత్తవారింటికి వెళ్లడం ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది. అక్కడ తన అత్తమామలు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, దానికి జోడుగా కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆదాయం గడించడం గమనించారు. అదే స్ఫూర్తితో తన ఊరిలో కూడా ఆధునిక సేద్యం చేయాలని గట్టిగా సంకల్పించుకున్నారు.
ఆధునిక సేద్యంతో అద్భుతాలు : తిరిగివచ్చిన వెంటనే దశరథ్ తన ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చారు. తనకున్న కొద్దిపాటి భూమిలోనే బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), సేంద్రియ ఎరువులు, మేలైన విత్తనాలు వాడటం ప్రారంభించారు. పాఠశాలలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ నేల సారాన్ని కాపాడటం, నీటి యాజమాన్యం వంటి పద్ధతులు పాటించారు. ఫలితంగా కూరగాయల దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఆ ఉత్సాహంతో చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. రూ.5 లక్షల పెట్టుబడితో భారీ ఎత్తున కూరగాయల సాగు చేపట్టారు. ఏటా 600 టన్నుల టమాటాలు, 900 టన్నుల క్యాప్సికం, 40 టన్నుల క్యాబేజీతో పాటు పుచ్చకాయ, దోసకాయ వంటి పంటలను పండిస్తున్నారు. ఇక్కడ పండించిన పంటలను బిహార్, బంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు నేపాల్‌లోని కాఠ్‌మాండూకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రసాయన రహితంగా ఉండటంతో నేపాల్‌లో వీరి టమాటాలు, క్యాప్సికంకు విపరీతమైన గిరాకీ ఉంది.
కోళ్ల పెంపకంతో కోట్లు : వ్యవసాయంతో పాటు ఏడు సంవత్సరాల క్రితం కోళ్ల పెంపకాన్ని కూడా ప్రారంభించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) పథకం కింద రూ.45 లక్షల రుణం తీసుకుని ఒక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. మొదట్లో 500 కోళ్లతో ప్రారంభమైన ఈ ఫామ్, ఇప్పుడు 20,000 బాయిలర్ కోళ్లతో కళకళలాడుతోంది. ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఏసీలు, హీటర్లు సైతం అమర్చడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి నుంచి ఝార్ఖండ్ పొరుగు రాష్ట్రాలకు కూడా కోళ్లను సరఫరా చేస్తున్నారు.
వందలాది మందికి ఉపాధి.. యువతకు ఆదర్శం : “నా అత్తమామల స్ఫూర్తితోనే ఈ ప్రయాణం మొదలుపెట్టాను. ఆధునిక పద్ధతులు పాటించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. నా భార్య మీనాదేవి ప్రోత్సాహం మరువలేనిది,” అని దశరథ్ సావ్ ఆనందంగా చెబుతారు. ఆయన కేవలం ఆర్థికంగా ఎదగడమే కాకుండా, తన పొలాల్లో, కోళ్ల ఫామ్‌లలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చుట్టుపక్కల రైతులను చైతన్యవంతం చేస్తూ, ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ ఎందరికో ముద్ర రుణాలు అందేలా చేశారు.
“వ్యవసాయం, కోళ్ల పెంపకంలో నాన్నకు సహాయం చేయడం గర్వంగా ఉంది,”
అని ఆయన పెద్ద కుమారుడు కన్హయ్య ప్రసాద్ తెలిపారు. అయితే, విద్యుత్ కోతలు, అధ్వాన్నమైన రహదారుల వల్ల రవాణా ఖర్చులు పెరగడం వంటి సవాళ్లు ఉన్నాయని, ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


