Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లాలో ప్రతి సంవత్సరం జూలై 15 నుండి ఆగస్టు 30 వరకు కిన్నెర కైలాస్ యాత్ర జరుగుతుంది. ప్రసిద్ధ కిన్నెర కైలాస యాత్ర ఈ ఏడాది తీవ్ర ప్రకృతి విపత్తులతో కుదేలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా యాత్ర మార్గాల్లో అనేక చోట్ల రహదారులపై వంతెనలు ధ్వంసమయ్యాయి. రాకపోకలు నిషేధించబడ్డాయి.
ఈ ప్రకృతి విలయం కారణంగా సుమారు 400–500 మంది యాత్రికులు పర్వత ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారిలో చాలామంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు కాగా, కొంతమంది స్థానిక పర్యాటకులు ఉన్నారు. నిత్యావసరాలు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని అంచనా వేసి, తక్షణమే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మరియు స్థానిక రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించింది. హెలికాప్టర్ల ద్వారా హుటాహుటిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హవాయ్ మార్గాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెస్క్యూ ప్రయత్నాలు కొన్ని చోట్ల ఆలస్యం అవుతుంది. ఇప్పటి వరకు ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా ద్వారా స్పందిస్తూ, “ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి అవగాహనతో ఉన్నాం. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు. పర్యాటకులు, యాత్రికులకు తక్షణంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.
Read more: https://teluguprabha.net/national-news/modi-trump-bromance-collapsed-congress-criticism/
ఈ యాత్రకు ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు వెళ్తుంటారు. కానీ వాతావరణ మార్పులు, హిమాలయ ప్రాంతాల్లో విపరీతమైన వర్షపాతం, నిర్మాణ క్షోభలు ఇలా అనేక అంశాలు ఇటువంటి విపత్తులకు దారితీస్తున్నాయి. యాత్ర ముందు భద్రతా సూచనలు, వాతావరణ అంచనాలు అనుసరించడం అత్యంత అవసరం అని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.


