Terrorist arrested: దేశ భద్రత పరంగా ప్రజలందరూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన గుజరాత్, ఢిల్లీ, నోయిడాల్లో చోటు చేసుకుంది. 2025 జూలై 23న(ఈరోజు) అల్కైదాతో సంబంధాలు ఉన్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ అరెస్టులు మరింత కలకలం రేపుతోంది. గుజరాత్ ATS డీఐజీ సునీల్ జోషీ మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్‌లో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, నోయిడాలో మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా వీరిని గుర్తించి, ఒకేసారి నాలుగు చోట్ల సోదాలు నిర్వహించి అరెస్టు చేసినట్టు వివరించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
పట్టుబడిన నిందితుల వివరాలు:
మొహమ్మద్ ఫైక్ (తండ్రి పేరు: మొహమ్మద్ రిజ్వాన్)
మహ్మద్ ఫర్దీన్ (తండ్రి పేరు: మహ్మద్ రయీస్)
సెఫుల్లా ఖురేషి (తండ్రి పేరు: మహమ్మద్ రఫీక్)
జీషన్ అలీ (తండ్రి పేరు: ఆసిఫ్ అలీ)
ఈ సమయంలో అల్కైదా ఉగ్రవాదులు భారత రాజధానిలో లేదా ఇతర కీలక ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. వీరికి గతంలో జరిగిన ఉగ్రదాడుల్లో సంబంధం ఉందా లేదా అన్నదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టులు దేశ భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.


