Saturday, November 15, 2025
Homeనేషనల్Garden school : తోట బడి.. ఫీజు చెత్త బస్తా! గురుదక్షిణగా ప్లాస్టిక్ స్వీకరిస్తున్న గురుమణులు!

Garden school : తోట బడి.. ఫీజు చెత్త బస్తా! గురుదక్షిణగా ప్లాస్టిక్ స్వీకరిస్తున్న గురుమణులు!

Gorakhpur garden school plastic fee:  పాఠశాలకు ఫీజు కట్టాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్న ఈ రోజుల్లో.. ఫీజు లేకుండా చదువు చెప్పడమే గొప్ప విషయం. అలాంటిది, గురుదక్షిణగా ప్లాస్టిక్ చెత్తను స్వీకరించే ఓ బడి గురించి మీరెప్పుడైనా విన్నారా? చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణనూ బోధిస్తున్న ఆ గురువులెవరు..? ఉత్తరప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఇద్దరు యువతులు సృష్టిస్తున్న ఆ నిశ్శబ్ద విప్లవంపై ప్రత్యేక కథనం.

- Advertisement -

తోటనే బడిగా మార్చి : గోరఖ్‌పూర్‌లోని జంగిల్ టికోనియా అనే గ్రామానికి చెందిన అనితా నిషాద్, నందిని ప్రజాపతి అనే ఇద్దరు యువతులు ఈ వినూత్న బడిని నడుపుతున్నారు. తమ ఊరిలోని ఓ పచ్చని తోటనే తరగతి గదిగా మార్చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు వీళ్ల బడి మొదలవుతుంది. నేలపై చాపలు పరిచి, ఓ నల్లబల్లపై అక్షరాలు దిద్దిస్తూ.. చదువు మధ్యలో ఆపేసిన పిల్లలకు, నిరక్షరాస్యులైన మహిళలకు జ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్నారు. 11వ తరగతి చదువుతున్నప్పుడే అనిత ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టగా, ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న నందిని ఆమెకు తోడైంది.

ఫీజు లేదు.. గురుదక్షిణగా ప్లాస్టిక్ : ఈ పాఠశాలలో ఫీజులు లేవు. కానీ, ఓ ప్రత్యేకమైన గురుదక్షిణ ఉంది. అదే ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’. బడికి వచ్చే ప్రతి విద్యార్థి, మహిళ తమ ఇళ్లలో, పరిసరాల్లో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తీసుకురావాలి. ఇదే వారు చెల్లించాల్సిన ఫీజు.

పర్యావరణ హితం: ఈ వినూత్న ఆలోచనతో గ్రామమంతా ప్లాస్టిక్ రహితంగా మారుతోంది.
60 క్వింటాళ్ల రీసైక్లింగ్: గత నాలుగేళ్లుగా ఈ బృందం ఏకంగా 60 క్వింటాళ్లకు పైగా ప్లాస్టిక్‌ను సేకరించి రీసైక్లింగ్ కోసం పంపింది. ఆ ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణంలో వాడే తారుగా మార్చడం విశేషం.

చదువుతో పాటు.. చైతన్యం : అనిత, నందిని కేవలం అక్షరాలు నేర్పడంతోనే సరిపెట్టడం లేదు. మహిళలకు రుతుస్రావ సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అరటి నారతో తయారుచేసిన శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ‘నారీ ఎంపవర్‌మెంట్ అవార్డు’తో సత్కరించింది.

‘సున్నా నుంచి హీరో అయ్యాం’ : “ఈ పిల్లలు మాకు చదువు చెప్పారు. సున్నా నుంచి మమ్మల్ని హీరోలను చేశారు. గతంలో నల్లబల్లపై ఏం రాసినా అర్థమయ్యేది కాదు, ఇప్పుడు నేను హిందీ వర్ణమాలతో పాటు కూడికలు, తీసివేతలు కూడా నేర్చుకున్నా,” అంటూ ఈ పాఠశాలలో చదువుకుంటున్న ప్రేమ్‌శిల, బెచాని దేవి అనే మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. క్రీడల్లోనూ జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఈ యువతులు, తమ గ్రామానికే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad