Maharastra: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహుర్తం ఖరారైంది. సీఎం పదవి ఎంపికపై ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు కనిపిస్తోంది. గతంలో రెండు సార్లు సీఎంగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)మరోసారి సీఎం కావడం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రొటీన్‌కు భిన్నంగా ఈసారి కూడా ఓ కొత్త నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సస్పెన్స్‌కు మరో రెండు రోజుల్లో తెర పడనుంది.
డిసెంబర్ 2న బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం డిసెంబర్ 5న దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర కీలక నేతలు భారీగా హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే సీఎం పదవి ఎంపిక నిర్ణయం పూర్తిగా బీజేపీ పెద్దలదే అని.. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని అపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)
, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) స్పష్టం చేశారు.