Newborn Wrong Injection Hand Amputation : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో వైద్య నిర్లక్ష్యం హృదయ విదారక ఘటనకు దారితీసింది. అక్టోబర్ 5న జన్మించిన ఒక నవజాత ఆడపిల్లకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె చేయి తీవ్ర ఇన్ఫెక్షన్‌తో కుళ్లిపోయింది. గ్యాంగ్రీన్ వ్యాపించకుండా చేతిని తొలగించాల్సి వచ్చిన పరిస్థితి రావటంతో తల్లిదండ్రులను కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ దారుణ సంఘటనపై తండ్రి బలేశ్వర్ భాటి పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్టోబర్ 5న జన్మించిన ఈ పసికందు అనారోగ్యంతో బాధపడుతుండటంతో, కుటుంబం దాద్రి ప్రాంతంలోని గోపాల్ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చికిత్సలో భాగంగా ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ, అది తప్పుడు మందు కావడంతో శిశువు చేయి తీవ్రంగా ఉబ్బి, నీలం రంగులోకి మారింది. తల్లిదండ్రులు వైద్యులకు చెప్పినా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి, చేతికి బ్యాండేజ్ చుట్టి మరో ఆసుపత్రికి పంపారు. అక్కడి వైద్యులు గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్ ధృవీకరించి, శరీరానికి వ్యాపించకుండా చేతిని తొలగించాలని సూచించారు.
ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో కలకలం రేపింది. బలేశ్వర్ భాటి ఫిర్యాదుపై దాద్రి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గౌతమ్ బుద్ధ నగర్ ముఖ్య వైద్య అధికారికి (CMO) లేఖ రాసి, విచారణ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. నిర్లక్ష్యం నిరూపితమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ నర్సింగ్ హోమ్‌లో ముందు కూడా ఫిర్యాదులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
ఇలాంటి దారుణ ఘటనలు వైద్య సిబ్బంది జాగ్రత్తలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాల అవసరాన్ని తలపిస్తున్నాయి. పేద కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడటంతో ఇలాంటి సమస్యలు తప్పవు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి వైద్య నిర్లక్ష్య ఘటనలు పెరుగుతున్నాయి. ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్న తల్లిదండ్రులు, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మహిళలు, పిల్లల ఆరోగ్య హక్కులపై ప్రశ్నలు లేవనెత్తింది.


