ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మహా కుంభమేళాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బాబాలు, నాగ సాధువులు, సన్యాసులు తరలి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రయాగ్ రాజ్‌లో ఓ బాబా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మహా కుంభమేళాలో ఐఐటీ బాబా అభయ్ సింగ్ గురించి చర్చ జరుగుతోంది. మొదట ఐఐటీలో చదివి ఉద్యోగం చేసిన అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతారమెత్తాడు. ఇప్పుడు అభయ్ సింగ్ ఐఐటీ బాబాగా ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యాడు. ఆయన జీవితంతో పాటు.. ఆయన చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తాను శ్మశానవాటికలో ఎముకలు తినేవాడినని ఇటీవల బాబా తెలిపి సంచలనం సృష్టించాడు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో.. తనకు పూర్వ జన్మ గురించి తెలుసని తెలిపాడు.
అంతేకాదు తను పూర్వ జన్మలో ఏం చేశానో కూడా చెబుతున్నాడు ఈ బాబా. తాను పూర్వ జన్మలో కృష్ణుడినని ఆయన అంటున్నాడు. ఇక ఈ బాబా తన విద్యాభ్యాసం గురించి మాట్లాడుతూ.. తాను ఎంతో క్లిష్టమైన గణిత ప్రశ్నలను సులభంగా పరిష్కరించేవాడినని పేర్కొన్నాడు. ఒకసారి పాఠశాలలో తన గురువు ఒక ప్రశ్న ఇచ్చారని.. ఆ రోజు రాత్రి నిద్రించినప్పుడు తన కలలో ఈ ప్రశ్నకు సమాధానం దేవుడు చూపించాడని వివరించాడు ఈ బాబా. మరుసటి రోజు నేను ఆ ప్రశ్నను పరిష్కరించి గురువుగారికి చూపించినప్పుడు.. అతను ఆశ్చర్యపోయాడని వివరించాడు.
ఇక చాలా మంది తనలో దేవుణ్ణి చూసేవారని ఈ ఐఐటీ బాబా చెప్పాడు. తనలో క్రీస్తుని, ఆది యోగిని, భైరవుడిని చూస్తున్నట్లు చెప్పారని వివరించాడు. అంతేకాదు ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉన్నాడన్నది తన నమ్మకమని ఈ ఐఐటీ బాబా వివరించాడు. అలాగే తనలో కూడా దేవుడు ఉన్నాడని.. గత జన్మలో తాను చేసిన లీలలు గుర్తుకు వస్తున్నాయని అభయ్ సింగ్ పేర్కొన్నాడు.