Indian government support for exporters : అగ్రరాజ్యం అమెరికా విధించిన భారీ సుంకాలతో భారత ఎగుమతిదారులు విలవిలలాడుతున్న వేళ, వారికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాల దెబ్బకు కుదేలవుతున్న కీలక రంగాలను గట్టెక్కించేందుకు మోదీ సర్కార్ భారీ ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. ఇంతకీ, ఈ ప్యాకేజీ స్వరూపం ఏమిటి..? ఏయే రంగాలకు ఊరట లభించనుంది..?
సుంకాల సుడిగుండంలో భారత ఎగుమతులు : భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% అదనపు సుంకాలు (25% సుంకం + 25% జరిమానా) ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి (మొత్తం ఎగుమతుల్లో 20% వాటా) అయిన అమెరికా నుంచే ఈ పిడుగులాంటి వార్త రావడంతో భారత ఎగుమతి రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
కుదేలవుతున్న కీలక రంగాలు : ఈ సుంకాల ప్రభావం ప్రధానంగా కొన్ని రంగాలపై తీవ్రంగా పడింది.
జౌళి రంగం (Textiles): “బంగ్లాదేశ్, వియత్నాం వంటి మన పోటీ దేశాలతో పోలిస్తే, ఈ కొత్త సుంకాలతో మాకు 30-31% తేడా వస్తోంది. ఇది మా పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుంది,” అని ఓ దుస్తుల ఎగుమతిదారు ఆవేదన వ్యక్తం చేశారు.
రత్నాలు, ఆభరణాలు (Gems & Jewellery): “మనం కట్ చేసి, పాలిష్ చేసే వజ్రాల్లో సగానికి పైగా అమెరికాకే ఎగుమతి చేస్తాం. ఈ కొత్త సుంకాల వల్ల మన మార్కెట్ వాటాను తుర్కియే, వియత్నాం వంటి దేశాలు దక్కించుకుంటాయి,” అని జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఛైర్మన్ కిరిట్ భన్సాలీ అన్నారు.
రొయ్యలు, తోళ్లు (Shrimp & Leather): ఇప్పటికే దిగుమతి నిరోధక సుంకాలతో సతమతమవుతున్న మన రొయ్యల పరిశ్రమకు ఇది గట్టి దెబ్బ. మరోవైపు, అమెరికా కొనుగోలుదారులు తమ పాత ఆర్డర్లను కొనసాగించాలంటే 20% రాయితీ డిమాండ్ చేస్తున్నారని ఓ తోళ్ల ఎగుమతిదారు వాపోయారు.
కేంద్రం చేయూత.. రూ.25,000 కోట్ల ప్యాకేజీ : ఈ సంక్షోభం నుంచి ఎగుమతిదారులను గట్టెక్కించేందుకు, కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 సమయంలో MSME రంగానికి అందించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ నమూనాలోనే ఓ భారీ ఉపశమన ప్యాకేజీని సిద్ధం చేస్తోంది.
ప్రతిపాదిత ప్యాకేజీ: 2025-31 మధ్య ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతిదారుల కోసం మొత్తం రూ.25,000 కోట్లు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రెండు ఉప-పథకాలు..
నిర్యత్ ప్రోత్సాహన్: ఈ పథకం కింద రూ.10,000 కోట్లు.
నిర్యత్ దిశ: దీని కింద రూ.14,500 కోట్లకు పైగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకాల ద్వారా ఎగుమతిదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చి, అంతర్జాతీయ మార్కెట్లో వారి పోటీతత్వాన్ని నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ప్రస్తుతం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని అధికారులు తెలిపారు.


