Sushant Sareen On G2 Dynamics: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బుసాన్‌లో జరిగిన భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ “జీ2” క్షణాన్ని భారత సెక్యూరిటీ విశ్లేషకులు ఒక “మెలకువ పిలుపు”గా అభివర్ణిస్తున్నారు. చైనా తన శక్తిని మౌనంగా పెంచుకుంటూ అమెరికాను సవాలు చేసే స్థాయికి చేరిందని, కానీ.. భారత్ మాత్రం శక్తివంతమైన దేశంగా నటిస్తోందని ఆబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ ఫెలో సుశాంత్ సరీన్ విమర్శించారు. నిశితంగా పరిశీలిస్తే ఆయన చెప్పినదానిలో నిజం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
భారత్ సూపర్‌పవర్ అవ్వాలనే కాంక్షకు ముందుగా ప్రాథమిక స్థాయిని బలపర్చుకోవాలని సరీన్ సూచించారు. మనకు ఉన్న శక్తిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే, సూపర్‌పవర్‌గా ఎలా మారతాం? ముందుగా ఆర్థిక, సైనిక సామర్థ్యాలను భారీగా పెంచుకోవాలని అన్నారు. ఊహలతో కాకుండా వాస్తవికంగా చెల్లుబాటు అయ్యేలా భారత ప్రణాళికలు ఉండాలని చెప్పారు.
ఇక భారత్ విదేశీ సాంకేతికతపై అధికంగా ఆధారపడటం, సంస్కరణల్లో లోపం వంటి సమస్యలను కూడా ఆయన ఎత్తిచూపారు. ప్రపంచంలో ఏ దేశమైనా ఆధునిక సాంకేతికతను సులభంగా ఇస్తాయని భావించడం మూర్ఖత్వం అని భారత రాజకీయ నాయకులకు సూచించారు. పాత టెక్నాలజీ కొనే అవకాశం ఉంది గానీ, అసలు శక్తివంతమైన టెక్నాలజీని కావాలనుకుంటే ఉన్న మార్గాలు.. మనం ఇతరుల రూపొందించాలి లేదా సొంతంగా సిద్ధం చేసుకోవటమేనన్నారు. సంస్కరణల దిశగా వేగంగా ముందుకు వెళ్లకపోతే ప్రపంచ పోటీలో వెనుకబడటం ఖాయమని సరీన్ అన్నారు.
అమెరికాను తన అరుదైన ఖనిజాలు లేకుంటే ఇబ్బంది పడే స్థాయికి మౌనంగా చైనా ఎదిగిందని.. తాజాగా ట్రంప్ డీల్ పరిశీలిస్తే ఇది అర్థం అవుతుందని సరీన్ చెప్పారు. టెక్నాలజీ, మిలిటరీ పరంగా ఇంత ఆధునికంగా మారినప్పటికీ ఇప్పటికీ తాము అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుంటూ చైనా ముందుకెళుతోందని.. కానీ భారత్ మాత్రం గొప్పలు చెప్పుకోవటంలో సమయం వృధా చేసుకుంటోందని చెప్పారు సరీన్. మెుత్తానికి సుశాంత్ సరీన్ పేర్కొన్నట్లుగా.. “G2” క్రమంలో ఏర్పడుతున్న అమెరికా–చైనా సాన్నిహిత్యం, భారతదేశం తన వ్యూహాత్మక ధోరణిని తిరిగి పరిశీలించుకోవలసిన సమయం వచ్చిందని సూచిస్తోంది. అభివృద్ధి దిశగా ప్రాథమిక సంస్కరణలు చేసి, సాంకేతిక స్వావలంబనను సాధించడం ద్వారానే భారత్ ప్రపంచ వేదికపై బలమైన స్థానం సంపాదించగలదని అభిప్రాయపడ్డారు.


