India Post Next day Delivery: త్వరలో పోస్టల్ సేవలు మరింత సులభతరం, వేగవంతం కానున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న తపాలా శాఖ.. మరో కీలక అడుగు ముందుకేసింది. ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు దీటుగా, దేశంలో ఏ మూలకైనా కేవలం 24 గంటల్లో పార్శిళ్లను చేరవేసేలా నూతన విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు 2026 జనవరి నాటికి ‘నెక్స్ట్ డే’ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రకటించారు.
Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-expresses-concern-over-digital-arrest-scams/
ఇటీవల రిజిస్టర్ పోస్ట్ విధానానికి పోస్టల్ శాఖ స్వస్తి పలికి స్పీడ్ పోస్ట్ సేవలోకి అప్‌గ్రేడ్ అయింది. అయితే ప్రస్తుతం ఇండియా పోస్ట్ ద్వారా పార్శిల్‌ను వేగంగా పంపినా, కస్టమర్‌కు చేరడానికి మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతోంది. ఈ సమయాన్ని మరింతగా తగ్గించి కేవలం 24 గంటలు, 48 గంటల్లోగా ఉత్తరాలను, పార్శిళ్లను గ్యారంటీ డెలివరీకి శ్రీకారం చుట్టనున్నట్లు కేంద్ర మంత్రి సింధియా పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
‘దేశంలోని అన్ని మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానుల్లో 48 గంటల్లో గ్యారెంటీ డెలివరీ సేవలను కూడా 2026 జనవరి నాటికి ప్రారంభిస్తాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో కలిసి పనిచేయనున్నాం. 2026 మార్చి నాటికి ఈ సంస్థలకు చెందిన వస్తువులను వినియోగదారుల ఇళ్లకు చేర్చే ‘లాస్ట్-మైల్ డెలివరీ’ సేవలను కూడా ఇండియా పోస్ట్ అందిస్తుంది.’ అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా సుమారు 1,64,999 పోస్టాఫీసులతో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఇండియా పోస్ట్ సేవలందిస్తోంది. ఈ విస్తృతమైన నెట్‌వర్క్ కారణంగా దేశంలోని ప్రతి గ్రామానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే ఒక పోస్టాఫీసు అందుబాటులో ఉండటం విశేషం. దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమెరికాకు అన్ని రకాల అంతర్జాతీయ పోస్టల్ సేవలను అక్టోబర్ 15 నుంచి తపాలా శాఖ తిరిగి ప్రారంభించింది. తాజాగా నెక్స్ట్ డే డెలివరీ విధానంతో పొదుపు, బీమా, ప్రభుత్వ పథకాలతో పాటు ఆధునిక డిజిటల్ సేవలు సైతం మారుమూల ప్రాంతాలకు సులభతరం కానున్నాయి.


