Friday, May 9, 2025
Homeనేషనల్సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్.. పాక్ క్షిపణి దాడులు.. తిప్పికొడుతున్న భారత్..!

సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్.. పాక్ క్షిపణి దాడులు.. తిప్పికొడుతున్న భారత్..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” దుమారం ఇంకా చల్లారకముందే.. పాకిస్తాన్ మరోసారి ఉగ్ర స్వరూపాన్ని ప్రదర్శించింది. గురువారం సాయంత్రం, జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాలపై పాక్ ఆర్మీ భారీ స్థాయిలో కౌంటర్ దాడులకు దిగింది. ఎయిర్‌స్ట్రిప్‌లు, సివిల్ స్థావరాలు సహా దాదాపు ఒక డజను ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఫిరంగి దాడులు, డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలు చేపట్టారు.

- Advertisement -

భద్రతా సంస్థల నివేదికల ప్రకారం, జమ్మూ సివిల్ విమానాశ్రయం, సాంబా, ఆర్‌ఎస్‌పురా, అర్నియా, అఖ్నూర్ పరిధిలో ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది పాకిస్తాన్. అయితే, భారత సైన్యం వినియోగిస్తున్న అత్యాధునిక రష్యన్ తయారీ S-400 వాయు రక్షణ వ్యవస్థ ఇవన్నీ గాల్లోనే తిప్పికొట్టింది. ఈ చర్యల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో పాక్ పంపిన రెండు డ్రోన్లు, ఖోర్ ప్రాంతంలో మరో రెండు డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ పటిష్టంగా గుర్తించి, గాల్లోనే పేల్చేసింది. కుప్వారా, ఉధంపూర్ ప్రాంతాల్లోనూ ఫిరంగి దాడులు జరిగినట్లు సమాచారం. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై కూడా లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ దాడికి భారత రక్షణ వ్యవస్థ తక్షణమే స్పందించింది. అఖ్నూర్, కిష్త్వార్ ప్రాంతాల్లో వైమానిక దాడుల హెచ్చరికగా సైరన్లు మోగించడంతో ప్రజలకు బ్లాక్‌అవుట్ ప్రకటించారు. జమ్మూ నగరంలోని విద్యుత్, ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. జమ్మూ పోలీసులు ప్రజలకు అప్రమత్తం కావాలని సూచిస్తూ, బ్లాక్‌అవుట్ సమయంలో ఇంటి వెలుతురు ఆర్పి, గృహాల్లోనే సురక్షితంగా ఉండాలని, రహదారులపై అనవసరంగా తిరగవద్దని హెచ్చరించారు.

భద్రతా వర్గాల అంచనా ప్రకారం, ఈ దాడులు గాజాలో హమాస్ వినియోగించే టాక్టిక్స్‌ను పోలి ఉన్నట్లు కనిపించాయి. తక్కువ ఖర్చుతో తయారైన పలు చిన్న రాకెట్లు ఒకేసారి ప్రయోగించటం ద్వారా భారత రక్షణ వ్యవస్థను చెక్ పెట్టాలన్నది పాక్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అల్మాజ్ ఆంటే సంస్థ అభివృద్ధి చేసిన S-400 వ్యవస్థ ఆ మాయాజాలాన్ని తిప్పికొట్టినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ తాజా దాడులు ఉగ్రవాదానికి పాక్ తాలూకు ప్రోత్సాహాన్ని మళ్లీ స్పష్టంగా నిరూపించాయి. ఒకవైపు ప్రతీకార దాడులకు సమర్థంగా స్పందిస్తూ, మరోవైపు ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ భారత రక్షణ వ్యవస్థ తన చాతుర్యాన్ని మరోసారి రుజువు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News