Wednesday, May 7, 2025
Homeనేషనల్Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. కీలక విషయాలు వెల్లడించిన భారత ఆర్మీ

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. కీలక విషయాలు వెల్లడించిన భారత ఆర్మీ

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)పేరుతో మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 100 మంది పాక్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. తాజాగా.. ఈ ‘ఆపరేషన్ సిందూర్’పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మాట్లాడుతూ.. ఉగ్రమూకలకు పాకిస్థాన్‌ అండగా నిలుస్తోందని పహల్లాగం ఉగ్రదాడి వెనక టీఆర్‌ఎఫ్‌ ఉందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు.

- Advertisement -

లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌పై నిషేధం దృష్ట్యా టీఆర్‌ఎఫ్‌ పేరుతో కార్యకలాపాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాక్‌ ఉగ్రమూకల శిబిరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. సీమాంతర ఉగ్రవాదంలో ఇప్పటివరకు 350 మంది భారతీయులు మృతి చెందారని.. 800 మందికి గాయాలవ్వగా.. 600 మంది సైనికులు మృతి చెందారని వెల్లడించారు. ఇకపై ఇలాంటి దాడులు ఉండకుండా ఉండేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని తెలిపారు.

ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. “ఆపరేషన్ సిందూర్ అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రారంభమైంది. 1.30 నిమిషాలకు ముగిసింది. ఆ 25 నిమిషాల వ్యవధిలోనే తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. ఈ ఆపరేషన్‌లో టెర్రర్ ఇండక్షన్‌లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేశాం. కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ దాడులు చేశాం” అని తెలిపారు.

ఇక వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మాట్లాడుతూ.. “పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశారు. పౌర, మౌలిక సదుపాయాలకు నష్టం జరగకుండా, పౌరుల ప్రాణాలను కోల్పోకుండా ఉండటానికి ఈ ప్రదేశాలను ఎంపిక చేశాం.” అని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News