Indian Railways links Aadhaar to IRCTC accounts :రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత పారదర్శకంగా మార్చడానికి ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 2025 నుంచి ఐఆర్‌సీటీసీ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ లింకింగ్ తప్పనిసరి.
ఎందుకీ నిర్ణయం: కొందరు అనధికారిక ఏజెంట్లు అక్రమ మార్గాల్లో టికెట్లు బుక్ చేసి బ్లాక్ చేస్తున్నారని రైల్వే శాఖ గుర్తించింది. దీని వల్ల సాధారణ ప్రయాణికులు టికెట్లు పొందలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నిజమైన ప్రయాణికులకు మొదటి అవకాశం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆధార్ లింకింగ్ వల్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. నిజమైన ప్రయాణికులు ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు. ఏజెంట్లకు 10 నిమిషాల తర్వాత యాక్సెస్ అనే నిబంధన భవిష్యత్తులో సైతం కొనసాగనుంది.
మీ IRCTC ఖాతా ఆధార్‌తో లింక్ అయిందో లేదో ఎలా తనిఖీ చేయాలి?:
- ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
- ‘My Account’ విభాగంలోకి వెళ్లి ‘My Profile’పై క్లిక్ చేయండి.
- అక్కడ మీకు ‘Aadhaar KYC’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- మీ ఆధార్ ఇప్పటికే లింక్ అయితే అక్కడ “KYC Verified” లేదా “Aadhaar Verified” అని కనిపిస్తుంది.
- ఒకవేళ లింక్ కాకపోతే ఆధార్ నంబర్‌ను నమోదు చేసే ఆప్షన్ వస్తుంది.
IRCTC అకౌంట్‌తో ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి?:
- IRCTC వెబ్‌సైట్/యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత ‘My Profile’ లోకి వెళ్లి ‘Aadhaar KYC’ పై క్లిక్ చేయండి.
- మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి ‘Submit’ బటన్‌ను నొక్కండి.
- మీ ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు OTP (One Time Password) వస్తుంది.
- ఆ OTPని నమోదు చేసి ధృవీకరణ పూర్తయ్యాక మీ IRCTC ఖాతా ఆధార్‌కు విజయవంతంగా లింక్ అవుతుంది.
ప్రయాణికులు ఈ మార్పును గమనించి టికెట్ బుకింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ IRCTC ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.


