IRCTC Server Down: దీపావళి పండుగ సందర్భంగా మొరాయించిన ఐఆర్‌సీటీసీ మరోసారి ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్, యాప్ పనిచేయకపోవడంతో టికెట్ బుకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఛట్ పూజ పండుగ నేపథ్యంలో ఇలాంటి లోపం రావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో, తత్కాల్ ఏసీ బుకింగ్ విండో ఓపెన్ అయిన వెంటనే, వెబ్‌సైట్ యాక్సెస్ ఆగిపోయింది.
Also Read: https://teluguprabha.net/national-news/8th-pay-commission-arrears-17-months-update/
టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో “This Site is currently unreachable, please try after some time” అనే ఎరర్ వస్తున్నట్లు ప్రయాణికులు పేర్కొన్నారు. అయితే దీపావళి సమయంలో కూడా ఇలాంటి సమస్యే ఎదురైనా.. కొన్ని గంటల తర్వాత సర్వర్ రీస్టోర్ అయింది. మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై ఐఆర్‌సీటీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. సేవల పునరుద్ధరణపై క్లారిటీ లేదు.
కాగా, దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల నుంచి ఈ సమస్యపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే పండుగల సీజన్ నేపథ్యంలో భారతీయ రైల్వే 12,000 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఛట్ పూజ పండుగ దృష్యా నార్త్-ఈస్ట్ రైల్వే అదనపు ఏర్పాట్లు చేసింది. మొత్తం 186 ప్రత్యేక రైళ్లు నడపడం, ప్రధాన స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసింది. గోరఖ్‌పూర్ వంటి స్టేషన్లలో భద్రతా చర్యలు, రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి.
కానీ టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఐఆర్‌సీటీసీ సర్వర్ సమస్యకు త్వరగా పరిష్కారం చూపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. పండుగ సీజన్‌లో తరచూ జరిగే ఇలాంటి సాంకేతిక లోపాలు రైల్వే ప్రయాణ అనుభవాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు. త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


