తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత(Jayalalithaa)కు సంబంధించిన ఆస్తులు తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వానికి అందించే ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి అయింది. భారీ భద్రత మధ్య కర్ణాటక అధికారులు ఆరు ట్రంకు పెట్టెలను తీసుకొచ్చి ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం వీటి విలువ సుమారు రూ.4వేల కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. బెంగళూరులోని జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఇటీవల స్పెషల్ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఆస్తులు, ఆస్తి పత్రాలను ప్రభుత్వానికి అందించడం పూర్తయిందని కర్ణాటక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ జవళి ప్రకటించారు.
జయలలితకు చెందిన ఆస్తుల్లో 27కిలోల బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి. ఇందులో 1.5కిలోల బంగారు కత్తి, బంగారు కిరీటం, వజ్రాలను నెమలి ఆకారంలో పొదిగిన ఒడ్డానం, జయలలిత రూపంలో ఉన్న బంగారు బొమ్మ ఉన్నాయి. వీటితో పాటు 11,300 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, ఎనిమిది వీసీఆర్ లు, 740 జతల పాదరక్షలు, 610 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8376 పుస్తకాలు ఇలా మొత్తం కలిపి 1,606 వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ.4వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా తమిళనాడు రాజకీయాల్లో దశాబ్ధాల పాటు ఓ వెలుగు వెలిగిన జయలలిత తీవ్ర అనారోగ్యంతో 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు.

కాగా ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి 1996లో జయలలిత అక్రమాస్తులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే జయలలిత జైలు జీవితం కూడా అనుభవించారు. ఈ కేసుకు సంబంధించి జయలలితకు చెందిన చరాస్తులతోపాటు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసును 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో భద్రపర్చారు.

