Jharkhand Elections| ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనులు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా తొలి విడతలో భాగంగా 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 683 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ఇక ఓటర్లు ఓటు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మాజీ సీఎం చంపై సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, ఎంపీ మహూవా మాఝీ, మాజీ సీఎం మధు కోడా భార్య గీతా, మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు.
“ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా తొలిసారి ఓటు వేయబోతున్న నా యువ మిత్రులందరికీ నా అభినందనలు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మిగిలిన నేతలు తెలిపారు.