Sunday, November 16, 2025
Homeనేషనల్Article 370 : కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా? రాష్ట్రపతితో మోదీ - షా భేటీ...

Article 370 : కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా? రాష్ట్రపతితో మోదీ – షా భేటీ వెనుక మర్మమేమిటి?

Jammu and Kashmir statehood : దేశ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన జమ్ముకశ్మీర్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దుకు ఆరేళ్లు సమీపిస్తున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకే రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో వేర్వేరుగా భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. అసలు జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర కిరీటం దక్కనుందా..? కేంద్ర పెద్దల వరుస భేటీల వెనుక అసలు వ్యూహం ఏమిటి..? 

- Advertisement -

అగ్రనేతల భేటీలు.. ఊపందుకున్న ఊహాగానాలు :జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకోనుందనే ప్రచారానికి అగ్రనేతల వరుస సమావేశాలు కారణమయ్యాయి. బ్రిటన్, మాల్దీవుల పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు.ఈ భేటీ జరిగిన కొద్ది గంటలకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రపతితో భేటీ అయ్యారు.

ఆ తర్వాత, అమిత్ షా జమ్ముకశ్మీర్‌ నేతలతోనూ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌తోనూ చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. “ఈ వరుస సమావేశాలన్నీ కశ్మీర్ అంశంపైనే జరిగినట్లు, రాష్ట్ర హోదా పునరుద్ధరణే ప్రధాన అజెండాగా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.”

చారిత్రక నిర్ణయం.. ఆర్టికల్ 370 రద్దు : 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సమగ్రత కోసం జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక స్వయంప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. తర్వాత జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అంటే జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌గా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు స్థానిక పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది కేవలం తాత్కాలిక ఏర్పాటేనని, జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టమైన తీర్పును వెలువరించింది.

రాష్ట్ర హోదా కోసం స్థానిక పార్టీల డిమాండ్ : కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత గతేడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరణే తమ ప్రధాన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం సరైన సమయంలో కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 5 సమీపిస్తున్న వేళ, ఆ సరైన సమయం ఆసన్నమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad