Monday, November 17, 2025
Homeనేషనల్Justice Yashwant Varma: న్యాయమూర్తిపై అభిశంసన వేటు.. ఉద్వాసనకు లోక్‌సభలో రంగం సిద్ధం!

Justice Yashwant Varma: న్యాయమూర్తిపై అభిశంసన వేటు.. ఉద్వాసనకు లోక్‌సభలో రంగం సిద్ధం!

Justice Yashwant Varma Impeachment: భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక అసాధారణ ఘట్టానికి రంగం సిద్ధమైంది. తీవ్ర అవినీతి ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను తొలగించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు శుక్రవారం స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతిపై పోరాటంలో పార్టీలకతీతంగా ఏకతాటిపైకి రావడానికి పాలక, ప్రతిపక్ష కూటములు అంగీకరించాయని ఆయన ప్రకటించడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏమిటీ నోట్ల కట్టల వివాదం…? ఒక న్యాయమూర్తిని అభిశంసన చేసేంతటి తీవ్ర ఆరోపణలకు దారితీసిన పరిణామాలేంటి..?

- Advertisement -

అగ్గి రాజేసిన నోట్ల కట్టలు: ఈ వివాదం మొత్తం ఈ ఏడాది మార్చి 14న దిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన ఒక అగ్నిప్రమాదంతో మొదలైంది.

అగ్నిప్రమాదం – బయటపడ్డ బండారం: ఆయన ఇంటి ఆవరణలోని ఒక గదిలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలో, అక్కడ సంచుల్లో ఉంచిన సగం కాలిన నోట్ల కట్టలు బయటపడటం పెను సంచలనం సృష్టించింది.

ALSO READ: https://teluguprabha.net/national-news/prime-minister-modi-became-most-popular-leader-in-the-world-again/

అంతర్గత విచారణ: ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నా, ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ఒక అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

నిగ్గు తేల్చిన కమిటీ: విచారణ జరిపిన కమిటీ, జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికింది నిజమేనని నిర్ధారించింది.ఇది తీవ్రమైన తప్పిదంగా పరిగణిస్తూ, జస్టిస్ వర్మను రాజీనామా చేయాలని సూచించింది.

రాజీనామాకు నిరాకరణ: అయితే, ఈ ఆరోపణలను కుట్రగా అభివర్ణించిన జస్టిస్ వర్మ, తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.

పార్లమెంటుకు చేరిన పంచాయితీ: జస్టిస్ వర్మ రాజీనామాకు ససేమిరా అనడంతో, సీజేఐ సంజీవ్ ఖన్నా ఆయనను తొలగించాలని సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు లేఖ రాశారు. దీనికి కొనసాగింపుగా పార్లమెంటులో ప్రక్రియ మొదలైంది.

ALSO READ: https://teluguprabha.net/national-news/election-commission-sir-nationwide-voter-list-revision/

కదిలిన ఎంపీలు: పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 150 మందికి పైగా లోక్‌సభ ఎంపీలు, 50 మందికి పైగా రాజ్యసభ సభ్యులు జస్టిస్ వర్మ అభిశంసనకు మద్దతుగా వేర్వేరుగా నోటీసులపై సంతకాలు చేశారు.

లోక్‌సభలో తీర్మానం: రాజ్యసభలో ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసు ఆమోదం పొందనప్పటికీ, దిగువ సభ అయిన లోక్‌సభలో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి మార్గం సుగమమైందని అధికార వర్గాలు తెలిపాయి.కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు సంబంధించిన ప్రక్రియ లోక్‌సభలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని రిజిజు నొక్కి చెప్పారు.

విచారణకు స్పీకర్ కమిటీ: ఈ ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ప్రముఖ న్యాయవేత్తతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ వర్మ: ఈ పరిణామాల మధ్య, తన వాదన వినకుండానే తనపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ కమిటీలో గతంలో తాను భాగమైనందున, ఈ పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. దీన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని పేర్కొన్నారు.

ఒకవైపు పార్లమెంటులో అభిశంసన కత్తి వేలాడుతుండగా, మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ ఉత్కంఠను రేపుతున్నారు. న్యాయవ్యవస్థ పవిత్రతను కాపాడటంలో ఈ కేసు ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad