కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో ఫస్ట్ పోస్టింగ్ లో జాయినింగ్ అయ్యేందుకు వెళుతున్న ఐపీఎస్ (IPS) అధికారి మృత్యుఒడికి చేరాడు. రోడ్డు ప్రమాదం రూపంలో అతనిని మృత్యువు కాటేసింది. ఈ ఘటన అతని కుటుంబసభ్యుల్ని, సన్నిహితుల్ని తీవ్ర దుఃఖానికి గురి చేసింది. ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే…
26 ఏళ్ల హర్ష్ బర్ధన్ కర్ణాటక కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్ IPS అధికారి. తన మొదటి పోస్టింగ్‌ను చేపట్టేందుకు వెళుతూ హసన్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆదివారం సాయంత్రం హసన్ తాలూకాలోని కిట్టనే సమీపంలో అతను ప్రయాణిస్తున్న పోలీసు వాహనం టైరు పగిలిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇల్లు, చెట్టును ఢీకొట్టింది. దీంతో హర్ష్ బర్ధన్ తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఐపీఎస్ అధికారి మధ్యప్రదేశ్‌కు చెందినవాడని పోలీసులు తెలిపారు.